* బిడ్డర్లకు సూటి హెచ్చరిక..
* ''ఈరోజు బిడ్ గెలిచాం.. రేపు భూమి మనదే” అనుకుంటే పొరపాటే
* వేలం గెలిచినా.. తుది నిర్ణయం మాత్రం కోర్టుదే!
Telangana High Court: హైదరాబాద్ రాయదుర్గ్ పాన్ మక్తా గ్రామంలోని సర్వే నెంబర్ 83/1లోని P1, P2 ప్లాట్ల ఈ-వేలంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ విచారణలో ఉంది. ఈ భూములు నోటిఫైడ్ హెరిటేజ్ ప్రీసింక్ట్‌లో భాగమా? అలాగే 27.01.2026 నాటి టెక్నికల్ కమిటీ నివేదికలో గుర్తించిన Rock Preserved Area తో వీటికి సంబంధం ఉందా? అనే కీలక అంశాలను కోర్టు పరిశీలిస్తోంది.
వేలం కోర్టు తీర్పుకు లోబడేనా?
విచారణ సందర్భంగా ప్రతిపాదిత ఈ-వేలం రిట్ పిటిషన్‌లో వెలువడే తుది ఫలితానికి లోబడి ఉంటుందని హైకోర్టు మౌఖికంగా స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
బిడ్డర్లకు భారీ రిస్క్?
ఒకవైపు Encumbrance Free Prime Land Parcels అంటూ భూములను ప్రచారం చేస్తూ ఈ-వేలం నిర్వహిస్తుండగా.. మరోవైపు అదే భూముల చట్టపరమైన స్థితిపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం బిడ్డర్లకు కీలక హెచ్చరికగా మారింది. కేసు తుది ఫలితం వచ్చే వరకు భూమిపై హక్కులు, వేలం ఫలితంపై భవిష్యత్తులో న్యాయపరమైన పరిణామాలు తలెత్తే అవకాశం ఉండటంతో.. బిడ్డర్లు పూర్తి వివరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
బిడ్ వేసే ముందు బిడ్డర్లు ఆలోచించాల్సిందే!
వేలంలో అత్యధిక బిడ్ వేసి గెలిచినంత మాత్రాన భూమిపై హక్కు పూర్తిగా ఖరారైనట్టుగా భావించలేని పరిస్థితి. భవిష్యత్తులో హైకోర్టు ఇచ్చే తుది తీర్పు లేదా ఆదేశాలు వేలం ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


