రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది.రాష్ట్రంలోని ములుగు జిల్లాలో గల సీతమ్మ సాగర్ ముంపు ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తవ్వకాల కోసం మూడు ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను తప్పుబట్టింది.
కాగా, సీతమ్మసాగర్ ముంపు ప్రాంతంలో 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.దీంతో గోదావరి నది మధ్యలో కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేపడుతుండగా.. వారికి ప్రభుత్వ పెద్దల మద్దతు ఉన్నట్టు సమాచారం.అయితే, పూడికతీత పేరుతో రూ.కోట్లల్లో స్థానిక అధికార పార్టీ నేతలు అక్రమంగా సంపాదించుకుంటున్నారని సమాచారం.సీతమ్మసాగర్ కరకట్టలు, ప్రధాన రహదారులు ఇసుక మాఫియా లారీల దెబ్బకు నాశనమవుతున్నాయని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు తవ్వకాలు చేపడుతున్నారని పునెం రాములు, తదితరులు ఎన్జీటీని ఆశ్రయించినట్టు తెలిసింది. పర్యావరణ ప్రభావిత అంచనా -2006 నిబంధనల ప్రకారం ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్లు ట్రిబ్యునల్‌ను కోరగా..పూడికతీత ప్రక్రియలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెల్లడించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ స్టే విధించడంతో పాటు విచారణ 21వ తేదీకి వాయిదా వేసింది.అంతేకాకుండా, ఇప్పటివరకు జరిగిన తవ్వకాలపై వివరణ ఇవ్వాలని మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను సైతం ఎన్జీటీ ఆదేశాలిచ్చింది.కాగా, ఎన్జీటీ తీర్పు ప్రభుత్వానికి బిగ్ షాక్ అని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అధికారపార్టీలోని బడా నేతలు, మంత్రుల సపోర్టు చూసుకుని కాంట్రాక్టర్లు, స్థానిక నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.


