భారత టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తుపై స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్, వీరిద్దరి కోచింగ్ ప్రయాణం ఏ విధంగా ఉండబోతోందనే దానిపై తన అంచనాలను పంచుకున్నారు. రోహిత్ శర్మ ఆట నుంచి తప్పుకున్న వెంటనే ఆయన అనుభవాన్ని, వ్యూహాత్మక చతురతను వినియోగించుకోవాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు ఆయన కీలక సూచన చేశారు.
క్రికెటర్లలో రోహిత్ శర్మ వంటి పదునైన ఆలోచనాపరులు చాలా అరుదుగా ఉంటారని అశ్విన్ కొనియాడారు. "ఒకవేళ రోహిత్ ఆట నుంచి తప్పుకోవాలని భావిస్తే, ముంబై ఇండియన్స్ యాజమాన్యం తక్షణమే ఆయనను తమ టీమ్‌లోకి తీసుకోవాలి. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలతో పాటు భారత్‌కు ప్రపంచకప్ అందించిన అద్భుతమైన నాయకుడిని వారు వదులుకోకూడదు" అని పేర్కొన్నారు. హెడ్ కోచ్ పదవి శ్రమతో కూడుకున్నది అనిపిస్తే, ఒకటి రెండేళ్ల విరామం తర్వాతైనా రాహుల్ ద్రవిడ్‌లా రోహిత్ మెంటార్ లేదా ఇతర పాత్రల్లోకి వస్తారని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో విరాట్ కోహ్లీ భవిష్యత్ ప్రణాళికలపై స్పందిస్తూ.. విరాట్ వెంటనే కోచింగ్ బాధ్యతలను చేపట్టే అవకాశం లేదని అశ్విన్ స్పష్టం చేశారు. వీరిద్దరూ తమ కెరీర్‌లో అత్యంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ సుదీర్ఘకాలం కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. ఆట నుంచి వైదొలిగిన తర్వాత విరాట్ కోహ్లీ కచ్చితంగా సుదీర్ఘ విరామం తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారని, అందుకే ఆయన తక్షణమే కోచింగ్ వైపు రాకపోవచ్చని స్పష్టం చేశారు. 39ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయిన నేపథ్యంలో అశ్విన్ చేసిన ఈ విశ్లేషణకు ప్రాధాన్యత ఏర్పడింది.
రాబోయే రోజుల్లో ప్రపంచ క్రికెట్ స్వరూపం వేగంగా మారబోతోందని, అంతర్జాతీయ క్రికెట్ కంటే ఫ్రాంచైజీ క్రికెట్ ఆధిపత్యం పెరగనుందని అశ్విన్ జోస్యం చెప్పారు. దీనివల్ల రాబోయే కాలంలో కేవలం హెడ్ కోచ్ పదవి మాత్రమే కాకుండా మెంటార్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వంటి ప్రత్యేక బాధ్యతలకు విపరీతమైన ఆదరణ పెరుగుతుందని అన్నారు. ఈ నూతన సాంకేతిక, వ్యూహాత్మక పదవులు రిటైర్ అయిన స్టార్ ఆటగాళ్లకు భవిష్యత్తులో అద్భుతమైన అవకాశాలను అందిస్తాయని అశ్విన్ వివరించారు.


