నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది.అయితే, నిన్న పెద్దఎత్తున గంజాయి పట్టుబడగా, నిందితులతో పోలీసులు దోస్తానా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న సాయంత్రం ఈగల్ టీమ్స్.. గంజాయి బ్యాచ్ ఇంటిపై దాడులు చేయగా పోలీసులపై నిందితులు కుక్కలను వదిలారు, అంతటితో ఆగకుండా స్క్రూ డ్రైవర్‌తో దాడి చేశారు.
వివరాల్లోకివెళితే.. హైదరాబాద్ - బాలానగర్‌లోని వినాయక్‌నగర్ శ్మశానవాటిక సమీపంలో ఓ ఇంట్లో ఉంటూ 2022 నుంచి ఏపీ - పాడేరుకు చెందిన దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ అనే ముగ్గురు అన్నదమ్ములు గంజాయి సప్లయ్ చేస్తున్నారు. ఏపీ-ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి తెచ్చి చిన్న చిన్న పొట్లాలుగా మార్చి వాట్సాప్ ద్వారా విక్రయిస్తున్నట్టు తెలిసింది. ముందస్తు సమాచారం మేరకు.. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అన్నదమ్ములు ఇంటికి వచ్చినట్లు గుర్తించిన ఈగల్ టీం పోలీసులు వారిని ముట్టడించారు.
దీంతో పోలీసుల మీదకు కుక్కను ఉసిగొల్పి, స్క్రూడ్రైవర్‌తో పొడిచి అన్నదమ్ములు దాడి చేశారు.నిందితులను పట్టుకొని విచారించగా వీరితో బాలానగర్ పీఎస్‌కు చెందిన పోలీసులు కూడా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్లు ఈగల్ టీమ్స్ గుర్తించాయి. ఈగల్ టీం దాడి చేసే కంటే కొన్ని గంటల ముందే నిందితుల ఇంటికి పోలీసులు వచ్చి పార్టీ చేసుకున్నట్లు తెలిసింది.
https://x.com/TeluguScribe/status/2088149093222863084?s=20
మంగళవారం జరిగిన పార్టీలో ఎస్సై, కానిస్టేబుల్ పాల్గొన్నట్లు గుర్తించారు. సదరు ఎస్సై రెండు రోజుల క్రితమే బాలానగర్ పీఎస్ నుంచి బదిలీ అయినట్టు సమాచారం. ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రైవేట్ పార్టీలకు నిందితులు మద్యం, క్యాటరింగ్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం. దీంతో నిందితులతో కుమ్మక్కైన సదరు పోలీసులు తనిఖీలకు ఎవరొచ్చినా ముందే సమాచారం ఇచ్చేవారని తెలిసింది.అలాగే నిందితుల ఫోన్లు చెక్ చేయగా.. 203 మంది వారి నుంచి గంజాయి కొన్నట్లు గుర్తించారు. అందులో వంద మందిని పరీక్షించగా, 72 మందికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.


