క్రైమ్

ఆస్తి పిచ్చికి పరాకాష్ట.. మరణించిన తండ్రి వేలిముద్రలతో దారుణం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఆస్తి పిచ్చి మనుషుల మధ్య రక్తసంబంధాలను ఎంతగా దిగజారుస్తుందో నిరూపించే అత్యంత దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. బతికి ఉన్నంత కాలం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రిని కనికరం లేకుండా ఇంట్లో నుంచి గెంటేసిన ఒక కొడుకు, ఆయన మరణించిన తర్వాత కూడా ఆస్తి కోసం దయ్యంలా మారాడు.

ఆస్తి పిచ్చి మనుషుల మధ్య రక్తసంబంధాలను ఎంతగా దిగజారుస్తుందో నిరూపించే అత్యంత దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. బతికి ఉన్నంత కాలం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రిని కనికరం లేకుండా ఇంట్లో నుంచి గెంటేసిన ఒక కొడుకు, ఆయన మరణించిన తర్వాత కూడా ఆస్తి కోసం దయ్యంలా మారాడు. ఆఖరికి తండ్రి మృతదేహాన్ని కూడా వదలకుండా ఖాళీ కాగితాలపై ఆయన వేలిముద్రలను తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. లక్నో సమీపంలోని ఖరౌహా గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానుష దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

బాధితుడు ఛత్రపాల్ (75) తన కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మిల నిరంతర వేధింపులు తట్టుకోలేక కొంతకాలంగా తన ముగ్గురు కుమార్తెల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. తల్లిదండ్రులను బతికుండగానే ఇంటి నుంచి వెళ్లగొట్టిన కొడుకు, కోడలికి తన ఆస్తిలో ఎలాంటి హక్కు లేదని, వారికి ఆస్తి చెందదంటూ ఛత్రపాల్ గతంలోనే పత్రికాముఖంగా బహిరంగ ప్రకటన కూడా చేశాడు. తనను ఆప్యాయంగా ఆదరించి పర్యవేక్షిస్తున్న ముగ్గురు కుమార్తెలకు తనకున్న కొంత భూమిని రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

అయితే, గత నెలలో ఛత్రపాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కుమార్తె సుమన్ తన అన్న మహేంద్రకు సమాచారం అందించారు. తండ్రికి మెరుగైన వైద్యం చేయిస్తానని నమ్మబలికి గ్రామానికి తీసుకెళ్లిన మహేంద్ర, రెండు రోజులకే ఆయన మృతి చెందినట్లు ప్రకటించాడు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సుమన్, బంధువులు గ్రామానికి చేరుకోగా అక్కడ దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. కనీస మానవత్వం లేకుండా చనిపోయిన తండ్రి చేతి వేలిని పట్టుకుని మహేంద్ర ఖాళీ కాగితాలపై ముద్రలు వేయిస్తుండటాన్ని గ్రామస్తులు, బంధువులు నిర్ఘాంతపోయారు.

ఆస్తి కాగితాల కోసం కొడుకు పడుతున్న తాపత్రయాన్ని చూసి అక్కడున్న వారంతా చూసి దిగ్బ్రాంతి చెందారు. అక్కడ ఉన్న ఎవరో వీడియోను చిత్రీకరించి నెట్‌లో పెట్టడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఖాళీ కాగితాలపై తీసుకున్న ఈ అక్రమ వేలిముద్రలతో భవిష్యత్తులో ఏ రకమైన మోసాలకు పాల్పడతాడోనని కుమార్తెలు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నతండ్రి మృతదేహాన్ని ఆస్తి కోసం వాడుకున్న కొడుకు తీరుపై తీవ్ర నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

https://x.com/Journo_Karan/status/2088114202917621915?s=20

#Uttar Pradesh#Property Dispute#Viral Video#Human Relations#Lucknow#Crime News#Property Greed#Crime Updates#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి