తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం (ఎక్స్)వేదికగా కౌంటర్ ఇచ్చారు. నిన్న కూకట్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓల్డ్ సిటీలో మైనారిటీలు కరెంట్ బిల్లులు కట్టరనే ఆరోపణలు ఉన్నాయని, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరాక అమలు చేస్తున్న 200 యూనిట్ల వరకు ఉచిత పథకం వల్ల ఎక్కువగా మైనారిటీలకే లబ్ధి చెందుతోందని సీఎం అన్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఫైర్ అయ్యారు.'పాతబస్తీలోని మైనారిటీలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని, అందుకే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని తెలంగాణ సీఎం అన్నారు. ఇదే మీ ప్రభుత్వ విధానమైతే.. నిబంధనలు పాటించలేదనే కారణంతో హైడ్రా చర్యలు తీసుకుంటున్నప్పుడు పేద కుటుంబాల విషయంలో ఇదే సానుభూతిని ఎందుకు చూపడం లేదు?' అని ప్రశ్నించారు.
ఓవైపు సీఎం పేద హిందూ కుటుంబాలపై నిబంధనల ఉల్లంఘన పేరుతో హైడ్రాను ప్రయోగిస్తూ ఇండ్లు కూల్చివేయిస్తున్నారని, మరోవైపు మైనారిటీల సంక్షేమం పేరుతో పాతబస్తీలో విద్యుత్ బిల్లులు చెల్లించకపోయినా వారిని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.ముస్లిములపై ఉన్న సానుభూతి హిందూ కుటుంబాలపై ఏదని నిలదీశారు.
హిందువుల ప్రయోజనాలను పణంగా పెట్టి మైనారిటీలను బుజ్జగించే రాజకీయాలు చేయడంలో ఖిలాఫత్ ఉద్యమం నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మారలేదని దుయ్యబట్టారు. ఇదిలాఉండగా, రంజాన్ పండుగకు రేవంత్ సర్కార్ రూ.30 కోట్లు కేటాయించడం, బోనాల పండుగకు కేవలం రూ.20 కోట్లు కేటాయించడంపైనా బీజేపీ కార్నర్ చేసింది. మెజార్టీ ప్రజలు జరుపుకునే బోనాల పండుగకు కేవలం తక్కువ నిధులు కేటాయించి.. రంజాన్ కు ఎక్కువ నిధులు కేటాయించడంతో కాంగ్రెస్ ముస్లిం పక్షపాతి అని మరోసారి నిరూపించుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


