డాలర్ డ్రీమ్స్‌కి డేంజర్ బెల్స్
ఇక అమెరికా చదువులు కష్టమేనా..?
కొత్త ఆంక్షలతో భారతీయ విద్యార్థుల్లో ఆందోళన
అమెరికాలో చదువు.. మంచి యూనివర్సిటీ.. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం.. కొన్నేళ్లలో మంచి కెరీర్.. ఇది చాలామంది భారతీయ విద్యార్థుల కల. ముఖ్యంగా ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా, టెక్నాలజీ రంగాల్లో ఉన్నత విద్య కోసం అమెరికా వైపు చూసే విద్యార్థుల సంఖ్య ఏళ్లుగా భారీగా ఉంది. కానీ ఇప్పుడు ఆ డ్రీమ్‌కు పరిస్థితులు అంత సులభంగా కనిపించడం లేదు. వీసా అపాయింట్‌మెంట్ల ఆలస్యం నుంచి కఠినమైన స్క్రీనింగ్ వరకు.. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
తాజాగా అమెరికాలోని 30 మంది సెనేటర్లు కూడా భారతీయ విద్యార్థులు సహా అంతర్జాతీయ విద్యార్థుల F, M, J వీసా అపాయింట్‌మెంట్లలో జరుగుతున్న ఆలస్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఫాల్ 2026 అకడమిక్ సీజన్ దగ్గరపడుతున్న సమయంలో అపాయింట్‌మెంట్లు ఆలస్యం కావడం వల్ల కొందరు విద్యార్థులు తమ కోర్సులను సమయానికి ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడుతోందని వారు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లారు.
అయితే సమస్య కేవలం అపాయింట్‌మెంట్ ఆలస్యంతోనే ఆగిపోవడం లేదు. గత ఏడాది అమెరికా F-1 విద్యార్థి వీసాల విషయంలో భారతీయులకు గణనీయమైన తగ్గుదల కనిపించింది. 2025 జూన్, జూలై నెలల్లో భారతీయులకు జారీ చేసిన F-1 వీసాలు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 69 శాతం తగ్గాయి. ఫాల్ సెమిస్టర్ ముందు సాధారణంగా విద్యార్థుల వీసా ప్రాసెసింగ్ ఎక్కువగా జరిగే సమయంలో ఇలాంటి తగ్గుదల రావడం సహజంగానే ఆందోళన కలిగిస్తోంది.
గతమెంతో ఘనం
అమెరికా యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థుల ప్రాధాన్యం ఎంత ఉందో చూస్తే ఈ పరిణామం మరింత ఆసక్తికరంగా మారుతుంది. అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం 2025లో అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఇండియా నుంచి వచ్చిన సైన్స్, ఇంజినీరింగ్ మాస్టర్స్ విద్యార్థులు సుమారు 77 వేల మంది ఉన్నారు. అయితే 2023లో ఈ సంఖ్య 1.44 లక్షలకు పైగా ఉంది. అంటే కేవలం రెండేళ్లలోనే భారీ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
దీని వెనుక మరో పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. అమెరికా వెళ్లే విద్యార్థులకు చదువు మాత్రమే కాదు.. చదువు తర్వాత ఉద్యోగం, ప్రాక్టికల్ ట్రైనింగ్, అక్కడి కెరీర్ అవకాశాలు కూడా కీలకం. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థుల వర్క్ ప్రోగ్రామ్‌లపై కూడా అమెరికా ప్రభుత్వం మరింత కఠినమైన పర్యవేక్షణ పెంచుతోంది. ముఖ్యంగా CPT వంటి ప్రోగ్రామ్‌ల వినియోగంపై యూనివర్సిటీలకు హెచ్చరికలు జారీ చేయడం.. నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితిని స్పష్టం చేస్తోంది.
అంత మాత్రాన అమెరికాలో భారతీయ విద్యార్థులకు తలుపులు మూసుకుపోయాయి అని చెప్పడం కూడా సరికాదు. ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన ఉన్నత విద్యా గమ్యస్థానాల్లో అమెరికా ఒకటి. భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే ఉంది. కానీ గతంలో ఉన్నట్టుగా అడ్మిషన్ వచ్చింది.. వీసా వస్తుంది.. వెళ్లి చదువుకుంటాం.. తర్వాత ఉద్యోగం చూసుకుంటాం అనే సింపుల్ ఫార్ములా ఇప్పుడు పనిచేయకపోవచ్చు.
అందుకే అమెరికా కలలు కనే విద్యార్థులు ఇక యూనివర్సిటీ ర్యాంకింగ్ ఒక్కటే చూడటం సరిపోదు. వీసా పరిస్థితులు, కోర్సు ఎంపిక, ఖర్చులు, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలు, వర్క్ ఆథరైజేషన్ నిబంధనలు.. అన్నింటినీ ముందుగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అమెరికా డ్రీమ్ ముగిసిపోలేదు.. కానీ ఆ డ్రీమ్ వైపు వెళ్లే రూట్ మాత్రం మారుతోంది. గతంలో ధైర్యంగా ముందుకెళ్లిన భారతీయ విద్యార్థులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది.


