సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి కేటాయించిన రూ.వందల కోట్ల విలువైన భూమి విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.రూ.లక్ష పెట్టుబడితో స్థాపించిన టెస్సరాక్ట్ కంపెనీకి సీఈవో తాను అని సీఎం సోదరుడు కొండల్ రెడ్డి పోస్టు పెట్టడం, ఒక్క ఉద్యోగి కూడా లేని ఆ కంపెనీకి రూ. 135 కోట్ల విలువ చేసే 5 ఎకరాలు కేటాయించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మన్నె క్రిశాంక్ తీవ్ర ఆరోపణలు , విమర్శలు గుప్పించారు.
దీనిపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కొండల్ రెడ్డి సంపాదించుకోవద్దా?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. రూ.135 కోట్ల భూస్కాం విషయంలో రేవంత్ సోదరుడికి కాంగ్రెస్ ఎంపీ చామల మద్దతుగా మాట్లాడటం పొలిటికల్ చర్చకు దారితీసింది. ‘రేవంత్ కుటుంబంలో ఎవరూ బాగుపడొద్దా? సంపాదించుకుంటే తప్పేంటి.
తక్కువ పెట్టుబడితో అనుమతి తీసుకుని చిన్న కంపెనీలు పెడితే రాద్ధాంతం చేస్తున్నారు. అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డికి ప్రభుత్వం భూమి కేటాయించింది’ అని పేర్కొన్నారు. ఓ వైపు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. టెస్సరాక్ట్ కంపెనీకి సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పగా.. అందుకు విరుద్ధంగా ఎంపీ చామల వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి.
https://x.com/TeluguScribe/status/2087941721015586850?s=20
సొంతపార్టీనేతలే ఒకరు అవునని,మరొకరు కాదని వ్యాఖ్యానించడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్నది. అయితే, ఎంపీ చామల వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయినట్టు సమాచారం. రేవంత్ సోదరుడు వ్యాపారాలు చేయకూడదా? అంటూ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పడంపై పలువురు మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేయగా, ఆమె చామలపై సీరియస్ అవ్వడం కాకుండా వివరణ కూడా కోరినట్టు ప్రచారం జరుగుతోంది.


