ఆందోళనలు చేస్తే అంతే..!
మీ ఫేస్‌ను గుర్తించారా.. ఇబ్బందులు షురూ...
నిరసనలను అణిచివేసేందుకు ఇదేం దారి..?
సుప్రీంకోర్టు ముందుకు పిటిషన్
ఒక్కసారి ఊహించండి... మీరు ఒక నిరసనలో పాల్గొంటున్నారు. మీ చుట్టూ వందల మంది ఉన్నారు. చేతుల్లో ప్లకార్డులు, నినాదాలు, పోలీసుల బందోబస్తు... సాధారణంగా చూస్తే అది ఒక ప్రజా నిరసనగానే కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న కెమెరా మిమ్మల్ని కేవలం రికార్డు చేయడం కాదు... మీ ముఖాన్ని గుర్తించి, మీరు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే? మీరు ఏ నిరసనలో పాల్గొన్నారు? ఎక్కడ ఉన్నారు? మీ ముఖం ఎక్కడ రికార్డైంది? ఇలాంటి ప్రశ్నలకు టెక్నాలజీ సమాధానం చెప్పగలిగితే... అది కేవలం పోలీసింగ్ వ్యవహారం కాదు. అది మన ప్రైవసీ, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించిన పెద్ద చర్చ.
ఇప్పుడు సరిగ్గా ఇదే అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌లో జరిగిన నిరసనల సమయంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఇతర బయోమెట్రిక్ సర్వైలెన్స్ టెక్నాలజీలను ఉపయోగించారన్న ఆరోపణలపై రాజ్యసభ ఎంపీ ఏ.ఏ. రహీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో శాంతియుత నిరసనల్లో పాల్గొనే వ్యక్తులపై ఇలాంటి బయోమెట్రిక్ నిఘా రాజ్యాంగం కల్పించిన ప్రైవసీ, స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కులపై ప్రభావం చూపుతుందని వాదించారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు అంగీకరించింది.
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అంటే ఏంటి..?
సింపుల్‌గా చెప్పాలంటే... కెమెరాలో కనిపించే వ్యక్తి ముఖ లక్షణాలను విశ్లేషించి, అందుబాటులో ఉన్న డేటాతో పోల్చి ఆ వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేయడం. సాధారణ CCTV కెమెరా ఎవరు అక్కడ ఉన్నారు? అనే దృశ్యాన్ని రికార్డు చేస్తుంది. Facial Recognition మాత్రం ఆ వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నకు టెక్నాలజీ ద్వారా సమాధానం వెతుకుతుంది. ఈ ఒక్క తేడానే మొత్తం చర్చను మరో స్థాయికి తీసుకెళ్తోంది.
ఇప్పుడు పోలీసుల కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద నిరసనలో హింస జరిగిందనుకోండి. ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యాయి. పోలీసులపై దాడి జరిగింది. నేరానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. వందల మంది ఉన్న ప్రాంతంలో వీడియో ఫుటేజ్ నుంచి అనుమానితులను గుర్తించడానికి Facial Recognition వంటి టెక్నాలజీ ఉపయోగపడవచ్చు. తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం, నేర పరిశోధనలో ఆధారాలను విశ్లేషించడం వంటి సందర్భాల్లో కూడా ఇలాంటి టెక్నాలజీకి ఉపయోగం ఉండొచ్చు. అందుకే టెక్నాలజీ అంటే నిఘా... నిఘా అంటే తప్పు అని ఒక్క మాటలో చెప్పేయడం కూడా సరైన విశ్లేషణ కాదు.
నిరసనలు చేసే హక్కు కూడా లేదా..?
అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. నేరం చేయని ఒక వ్యక్తి కేవలం నిరసనలో పాల్గొన్నందుకు అతని ముఖాన్ని ప్రభుత్వం గుర్తించి డేటాగా మార్చవచ్చా? ఒక పౌరుడు తన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ఒక విధానాన్ని వ్యతిరేకించడానికి లేదా తన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేయడానికి రోడ్డుపైకి వస్తే... అతను నేరస్థుడు కాదు. మరి అలాంటి వ్యక్తిపై బయోమెట్రిక్ నిఘా పెట్టడానికి ఏ పరిమితులు ఉండాలి?
జంతర్ మంతర్ వ్యవహారంలో ఇదే ప్రధాన వివాదం. పిటిషన్ ప్రకారం, నిరసనల సమయంలో CCTV కెమెరాలు, డ్రోన్లు, బాడీ-వోర్న్ కెమెరాలు, మొబైల్ కమాండ్ వాహనం, AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ వంటి పలు సాంకేతిక పరికరాలను ఉపయోగించారని ఆరోపించారు. ఆందోళనకారులను గుర్తించేందుకు.. ఐక్షన అనే అనే వాహనం, ఫింగర్‌ప్రింట్ మ్యాచింగ్ కోసం NCRBకి చెందిన “Abhigyan” యాప్ వంటి వ్యవస్థలను ఉపయోగించారన్నది పిటిషన్‌లోని వాదన.
భారతదేశంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగాన్ని నియంత్రించే ప్రత్యేక సమగ్ర చట్టం ఉందా? ప్రస్తుతం పోలీసులు AI ఆధారిత నిఘా టెక్నాలజీలను ఎలా, ఎప్పుడు, ఏ పరిమితుల్లో ఉపయోగించాలన్న దానిపై ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. జంతర్ మంతర్‌కు సంబంధించిన ఢిల్లీ హైకోర్టు పిటిషన్ కూడా ఇదే ప్రశ్నలను లేవనెత్తింది.
అంటే అసలు సమస్య టెక్నాలజీ ఉందా లేదా అనేది కాదు. దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఎవరిని గుర్తిస్తున్నారు? ఆ డేటా ఎంతకాలం ఉంచుతున్నారు? ఎవరు యాక్సెస్ చేస్తున్నారు? తప్పుగా ఒక వ్యక్తిని గుర్తిస్తే బాధ్యత ఎవరిది? ఇవే కీలకమైన ప్రశ్నలు.
ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక నిరసనకు వెళ్లారు. అక్కడ ఎలాంటి హింస చేయలేదు. కేవలం మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఇంటికి వచ్చేశారు. కానీ మీ ముఖం ఒక డేటాబేస్‌లోకి వెళ్లిందనుకోండి. ఆ డేటా తర్వాత ఎక్కడ ఉపయోగించబడుతుంది? మరో నిరసనలో మీ ముఖం కనిపిస్తే మళ్లీ గుర్తిస్తారా? మీ గత కదలికలతో దాన్ని అనుసంధానిస్తారా? ఆ డేటా ఎప్పుడు తొలగిస్తారు? ఒక సాధారణ పౌరుడికి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే హక్కు ఉండాలా.. లేదా? ఇదే ప్రైవసీ చర్చలోని అసలు అంశం.
చట్టం ఏం చెబుతోంది..?
భారత సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రైవసీని రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అందుకే ఏదైనా ప్రభుత్వ నిఘా వ్యవస్థ వచ్చినప్పుడు.. ప్రజల భద్రత కోసం చేస్తున్నాం అనే ఒక్క కారణంతో విషయం ముగిసిపోదు. నిఘా అవసరమా? అది చట్టబద్ధమైనదా? అవసరానికి మించి ఉందా? వ్యక్తి హక్కులపై పడే ప్రభావంతో పోలిస్తే ప్రభుత్వ ప్రయోజనం సముచితంగా ఉందా? వంటి రాజ్యాంగ ప్రమాణాలు కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
అయితే మరోవైపు పోలీసుల చేతుల్లో టెక్నాలజీ లేకపోవడం కూడా సమస్యే. నేరాలు పెరిగినప్పుడు, పెద్ద జనసమూహాల్లో హింస జరిగినప్పుడు ఆధునిక టెక్నాలజీని పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. అందుకే భద్రతా అవసరం, పౌర స్వేచ్ఛ ఈ రెండింటి మధ్య సమతుల్యతే అసలు సవాల్.
ఇక్కడే సుప్రీంకోర్టు ముందున్న ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు ఏ విధమైన మార్గదర్శకాలు ఇస్తుందో, చట్టపరమైన పరిమితులపై ఏం చెబుతుందో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పోలీసు సర్వైలెన్స్ విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇది కేవలం జంతర్ మంతర్ కథ కాదు. ఈరోజు ఒక నిరసన ప్రదేశంలో ఫేషియల్ రికగ్నిషన్ గురించి చర్చిస్తున్నాం. రేపు అది క్రికెట్ స్టేడియంలో కావచ్చు. రైల్వే స్టేషన్‌లో కావచ్చు. విమానాశ్రయంలో కావచ్చు. పెద్ద ప్రజా కార్యక్రమంలో కావచ్చు. టెక్నాలజీ సామర్థ్యం పెరిగే కొద్దీ దాని వినియోగం కూడా విస్తరించే అవకాశం ఉంది.
అందుకే ఇప్పుడు ఒక రూల్ స్పష్టంగా ఉండాలి. ప్రజలను రక్షించడానికి కెమెరాలు ఉండొచ్చు. నేరస్థులను గుర్తించడానికి టెక్నాలజీ ఉండొచ్చు. కానీ ఆ పేరుతో ప్రతి పౌరుడి ముఖం, కదలిక, గుర్తింపును నిరంతరం ట్రాక్ చేసే వ్యవస్థగా మారకూడదు. ప్రజాస్వామ్యంలో నిరసన చేయడం నేరం కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదు. తమ హక్కుల కోసం శాంతియుతంగా గొంతు వినిపించడం నేరం కాదు. అదే సమయంలో నిరసన పేరుతో హింసకు పాల్పడటం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం కూడా హక్కు కాదు. ఈ రెండు విషయాల మధ్య లైన్‌ను టెక్నాలజీ చెరిపేయకూడదు.
ప్రజల భద్రత కోసం టెక్నాలజీ అవసరమే. కానీ అదే టెక్నాలజీ వల్ల ప్రజలు తమ స్వేచ్ఛను వినియోగించుకోవడానికి భయపడే పరిస్థితి వస్తే? అప్పుడు సమస్య కెమెరాలో ఉండదు. కెమెరా వెనుక ఉన్న అధికారంలో ఉంటుంది. టెక్నాలజీని ఆపడం పరిష్కారం కాదు. నిఘాను పూర్తిగా అనుమతించడం కూడా పరిష్కారం కాదు.
భద్రత కావాలి... కానీ స్వేచ్ఛను కోల్పోకుండా.
టెక్నాలజీ కావాలి... కానీ ప్రైవసీని త్యాగం చేయకుండా.
ప్రజాస్వామ్యంలో కెమెరా ప్రజలను కాపాడాలి... భయపెట్టకూడదు.


