టాప్ న్యూస్

గ్లోబల్ స్పేస్ రేస్‌లో భారత్.. మార్కెట్‌లో ఐదు రెట్లు పెరగనున్న వాటా!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వేగంగా పురోగమిస్తోంది. ప్రస్తుతం గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో భారతదేశ వాటా కేవలం రెండు శాతానికంటే తక్కువగానే ఉన్నప్పటికీ, రాబోయే ఐదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో ఏకంగా 10శాతానికి చేరుకుంటుందని అమెరికా వాణిజ్య శాఖ నివేదిక అంచనా వేసింది.

ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వేగంగా పురోగమిస్తోంది. ప్రస్తుతం గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో భారతదేశ వాటా కేవలం రెండు శాతానికంటే తక్కువగానే ఉన్నప్పటికీ, రాబోయే ఐదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో ఏకంగా 10శాతానికి చేరుకుంటుందని అమెరికా వాణిజ్య శాఖ నివేదిక అంచనా వేసింది. ఇది ప్రస్తుత వాటాతో పోలిస్తే దాదాపు ఐదు రెట్ల వృద్ధిని సూచిస్తోంది. దేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న నూతన అవకాశాలు, ప్రోత్సాహకాలే ఈ వేగవంతమైన పురోగతికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ‘ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్’ విడుదల చేసిన ఆగస్టు సంచిక నివేదికలో భారత అంతరిక్ష విభాగాన్ని ప్రత్యేకంగా ‘మార్కెట్ ఆఫ్ ద మంత్’గా ప్రకటించింది. భారత్‌లో సానుకూల విధానపరమైన నిర్ణయాల వల్ల ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌లు వేగంగా విస్తరిస్తున్నాయని కొనియాడింది. ఉపగ్రహ తయారీ వ్యవస్థలు, కనెక్టివిటీ, ఆధునిక అంతరిక్ష ప్రయోగాలు, సంబంధిత సాంకేతికతలలో భారీ అవకాశాలు లభ్యమవుతుండటంతో, భారత మార్కెట్‌పై అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థలు తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.

చారిత్రాత్మకంగా 1963లో భారత్ ప్రయోగించిన తొలి రాకెట్ సమయం నుంచే ఇరు దేశాల మధ్య అంతరిక్ష బంధం కొనసాగుతోంది. నాసా, వివిధ అమెరికన్ పరిశోధనా సంస్థలు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక పరికరాల రూపంలో ఇస్రోకు నిరంతరం సహకారం అందిస్తున్నాయి. ప్రస్తుతం ఇది శాస్త్రీయ సమాచార మార్పిడి, సంయుక్త ప్రయోగాలు, వ్యాపార విస్తరణ వరకు బలపడింది. దీనికితోడు భారతీయ అంతరిక్ష స్టార్టప్‌లు కూడా తమ తయారీ సామర్థ్యాన్ని అమెరికా వ్యాప్తంగా విస్తరించడానికి గల మార్గాలను అన్వేషిస్తుండటం విశేషం.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎగుమతి నిబంధనలలో ఉన్న సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇరు దేశాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. దీనిలో భాగంగానే బెంగళూరులో సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక స్పేస్ ఎక్స్‌పోలో అమెరికన్ కంపెనీలు పెద్ద ఎత్తున భాగస్వామ్యమవ్వాలని ఆదేశ వాణిజ్య శాఖ సూచించింది. ఈసదస్సు ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలు మరింత బలోపేతమై, అంతరిక్ష పరిశోధనలలో భారత్ అధిపత్యం స్పష్టంగా కనిపించనుందని భావిస్తున్నారు.

 

#ISRO#Space Market#India Space Sector#US Commerce Department#NASA ISRO Collaboration#Bengaluru Space Expo#Space Startups India#Indian Economy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి