భారతీయ జెన్ జీ(Gen Z) యువత అంటే కేవలం షాపింగ్, వినోదం, విహారయాత్రలకే ప్రాధాన్యత ఇస్తారనే అభిప్రాయం సమాజంలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే, ఈ విలాసవంతమైన జీవనశైలి ఆలోచనలకు భిన్నంగా వారి వాస్తవ ఖర్చుల తీరు ఉందంటూ సాలరీ సే(SalarySe) అనే సంస్థ జరిపిన నూతన అధ్యయనం స్పష్టం చేసింది. ఉద్యోగాలు చేస్తున్న GenZ వినియోగదారులకు సంబంధించిన లక్షలాది యూపీఐ (UPI) లావాదేవీల డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. అందులో యువత తమ నెలవారీ సంపాదనలో సింహభాగాన్ని రోజువారీ అవసరాలు, ఆర్థిక బాధ్యతలకే కేటాయిస్తున్నారని తేలింది.
ఈ అధ్యయనం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జెన్‌జీ యువత తమ నెలవారీ ఖర్చుల్లో బిల్లులు, డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లకు అత్యధికంగా 20.1శాతం వెచ్చిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కిరాణా సరుకులకు 15.7శాతం, బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సేవలకు 12.2శాతం, షాపింగ్‌కు 11.9శాతం, ఆహారానికి 11.5శాతం సొమ్మును కేటాయిస్తున్నారు. ఈ ఐదు రకాల ప్రాథమిక విభాగాలోనే వారి మొత్తం ఆదాయంలో 70శాతానికి పైగా ఖర్చవుతుండటం గమనార్హం. వినోదభరిత సబ్‌స్క్రిప్షన్లలో జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫైలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
వయస్సు పెరుగుతున్న కొద్దీ జెన్ జీ ఆర్థిక బాధ్యతల రూపం కూడా వేగంగా మారుతోంది. 18 నుంచి 23 ఏళ్ల వయస్సున్న వారిలో ప్రాథమిక అవసరాల ఖర్చు 50శాతంగా ఉండగా, 24 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులకు వచ్చేసరికి ఇది 59శాతానికి పెరిగింది. వృత్తిపరమైన బాధ్యతలు పెరగడం, స్వతంత్ర జీవనం, కుటుంబ అవసరాలు తోడవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వినోదం, ఇతర ప్రైవేట్ ఖర్చుల శాతం రెండు వయస్సు వర్గాలలోనూ దాదాపు 32శాతంగా స్థిరంగా కొనసాగుతోంది.
ప్రతికూల ప్రచారాలకు భిన్నంగా భారత జెన్ జీ యువత ట్రావెల్ లేదా ప్రయాణాల కోసం తమ ఆదాయంలో కేవలం 5శాతం మాత్రమే ఖర్చు చేస్తుండటం విశేషం. డిజిటల్ విప్లవం, యుపీఐ సేవలు, ఆటో-పే సౌకర్యాలు వీరి ఆర్థిక లావాదేవీలను మరింత సులభతరం చేశాయని సాలరీసే సహ వ్యవస్థాపకుడు పీయూష్ బగారియా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే, సరికొత్త ట్రెండ్‌లను అనుసరిస్తున్నప్పటికీ, భారతీయ జెన్ జీ యువత బడ్జెట్ ప్రాథమికంగా నిత్య జీవిత అవసరాలకే కేటాయిస్తూ ఆర్థిక క్రమశిక్షణతో అడుగులు వేస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.


