రాష్ట్రంలో కరువు కాటకాలు సంభవించాలని, వర్షాలు పడకుండా ఉండేందుకు బీఆర్ఎస్ మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కర్ణాటక వెళ్లి చేతబడులు, క్షుద్రపూజలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించగా.. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేతబడులు, క్షుద్రపూజల గురించి ప్రస్తావించడం ప్రజలను మూఢనమ్మకాల వైపునకు తీసుకెళ్తుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు.
అయితే, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి అయ్యేందుకు రేవంత్ రెడ్డి సైతం చేతబడులు, క్షుద్ర పూజలు చేశారా? అని ప్రశ్నించారు.
నవీన యుగంలో క్షుద్ర పూజలు, చేతబడులు అని మాట్లాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి ఎంత పనికి మాలినోడో, అసమర్ధుడో అర్థం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. చిల్లర మాటలు, చిల్లర వేషాలు, చిల్లర డ్రామాలు ఎన్ని రోజులు చేస్తావు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచిందని, ప్రజలకు చేయాల్సిన వాటి మీద మాట్లాడకుండా బూతు పురాణాలు, క్షుద్ర పూజలు అంటూ రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని డాక్టర్ సంజయ్ మండిపడ్డారు.
https://x.com/TeluguScribe/status/2088186784358506990?s=20
ఇదిలాఉండగా, నిన్న ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన అనంతరం కూకట్ పల్లిలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘కొంతమంది కరువు రావాలని కర్ణాటక, తమిళనాడు పోయి అఘోరా పూజలు చేశారు. నేను గొప్ప తెలివి ఉన్నోడిని, పెద్ద పెద్ద చదువులు చదివినోడిని అని నేను చెప్పను. కానీ నా సంకల్పం గొప్పది.. దేవుడు నా దిక్కే ఉన్నాడు. అందుకే హైదరాబాద్‌కు తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు’ అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


