తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఫీజు రీయింబర్స్ మెంట్‍పై తీవ్రమైన చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాలు అయితే.. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రజా ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని బాహాటంగానే విమర్శలు లేవనెత్తాయి.. ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్ మెంట్‍పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అడ్వాన్స్ గా విద్యార్థుల ఖాతాలో ఈ డబ్బులు జమ చేయనున్నట్టు తెలిపారు.
మరోవైపు ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన రూ.250 కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే జమచేశామని భవిష్యత్‍లో కళాశాలల్లో ప్రవేశాలు పొందాక ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకున్న నెలలోపు ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ HMDA గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను నేడు సీఎం ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పారదర్శకంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక నుండి ఫీజు కట్టలేదని సర్టిఫికెట్ ఇవ్వమని కాలేజీ యాజమాన్యాలు చెప్పే పరిస్థితి రాదని పేర్కొన్నారు.. అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా బీసీ జనగణనతో పాటు, ఎస్సీ కులగణన కూడా చేపట్టామని అన్నారు.
గత ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలని చెబితే మేము డాక్టర్లు, లాయర్లు ఐఏఎస్, ఐపీఎస్ లు, ప్రజాప్రతినిధులు కావాలని అంటున్నామన్నారు. ఇక ట్యాంక్ బండ్ కు వస్తే గొప్ప వ్యక్తుల విగ్రహాలు కనిపిస్తాయని తెలిపిన సీఎం.. ఇవి కేవలం విగ్రహాలే కాదని వారు చేసిన త్యాగాలు. వాళ్ల గొప్పతనాలు భావితరాలకు తెలియచేసే గుర్తులని వివరించారు. అలాగే సమాజంలో కుల నిర్మూలకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు..
సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికే ప్రపంచం రెడ్ కార్పెట్ తో స్వాగతిస్తోందని తెలిపిన రేవంత్ రెడ్డి.. ఏఐ వల్ల ఐటీ నిపుణుల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడిందని, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ సిద్దమవ్వాలని అన్నారు. ఈ క్రమంలో చదువుల్లో నాణ్యత ఉండాలని.. స్కిల్స్ పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేయడమే కాకుండా.. ఒలింపిక్స్ లో మెడల్స్ సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగం, నజరానాలు కూడా ఇచ్చి ప్రోత్సాహిస్తున్నట్టు వివరించారు..


