తెలంగాణ

Telangana: ఉచిత బస్సు పథకం.. మహిళలకు మేలా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శాపమా!?..

రచన: Venu••8 నిమిషాల పఠనం

ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కానీ దానికి తగినట్లుగా బస్సుల సంఖ్య పెరిగిందా అనే ప్రశ్నకు సమాధానం లేదు.. ఫలితంగా బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఒకవైపు ఉచితంగా ప్రయాణించే మహిళలు, మరోవైపు నెలవారీ పాస్‌లు తీసుకున్న విద్యార్థులు, సాధారణ టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణించే పురుషులు అంతా ఒకే బస్సులో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లో చర్చకు తెరతీసింది. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వానికి సుమారు రూ.12 వేల కోట్ల వరకు ఖర్చవుతోందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. ఒకవైపు ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, విద్యార్థినులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, వ్యాపారాలు, ఆసుపత్రులు, ఇతర పనుల కోసం వెళ్లే కోట్లాది మంది మహిళలకు ఇది ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తోంది.

ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ముందుకు సాగేందుకు ఈ పథకం దోహదపడుతుంది. మరోవైపు ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కానీ దానికి తగినట్లుగా బస్సుల సంఖ్య పెరిగిందా అనే ప్రశ్నకు సమాధానం లేదు.. ఫలితంగా బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఒకవైపు ఉచితంగా ప్రయాణించే మహిళలు, మరోవైపు నెలవారీ పాస్‌లు తీసుకున్న విద్యార్థులు, సాధారణ టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణించే పురుషులు అంతా ఒకే బస్సులో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలాగే డబ్బులు చెల్లించి టికెట్ కొన్న ప్రయాణికుడు కూడా బస్సులో ఉన్న రష్ వల్ల నిలబడి ప్రయాణించవలసి రావడంతో.. వాళ్ళు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఆటోలు, క్యాబ్‌లు లేదా ప్రైవేట్ రవాణా వైపు దృష్టి సారిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇలా టికెట్ కొనే రెగ్యులర్ ప్రయాణికులు ఆర్టీసీకి దూరమైతే, అది చివరికి సంస్థ రాబడికే నష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇక మగవారి సీట్లో కూర్చుంటూన్న మహిళలు కనీసం వయస్సు మళ్లిన వారు వచ్చినా సీటు ఇచ్చే పరిస్థితులు కనబడటం లేదనే ఆరోపణలున్నాయి.

మరోవైపు ఈ ఉచిత ప్రయాణ భారాన్ని ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ, ఆ ఖర్చును పూడ్చుకునేందుకు విద్యార్థుల బస్‌పాస్‌లు, జనరల్ పాస్‌లు, డీలక్స్ వంటి సేవల చార్జీలను పెంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగానికి వెళ్లే ఒక సాధారణ మధ్యతరగతి పురుషుడికి ఉచిత ప్రయాణం ఉండదు. బస్ పాస్ ధర పెరిగినా, టికెట్ రేట్లు పెరిగినా ఆ భారమంతా అతనే మోయాల్సి వస్తోంది. అలాగే చదువుకోడానికి రోజూ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల బస్ పాస్ ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా వారి కుటుంబాలపై పడుతుంది. ఒక వర్గానికి ఉచితం ఇస్తూ, మరో వర్గంపై ఆ భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

అంతేకాకుండా, ప్రయాణం ఉచితంగా మారడంతో అవసరం లేకపోయినా చిన్న చిన్న పనులకు, తక్కువ దూరాలకు ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య పెరిగిందనే విమర్శలూ లేకపోలేదు. ఈ అంశం చిన్నదిగా అనిపించినా.. దీనివల్ల బస్సులపై రద్దీ పెరిగి నిర్వహణ ఖర్చులు, సర్వీసులపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతాయి. అలాగని ఈ పథకాన్ని కేవలం నష్టంగా మాత్రమే జమకట్టలేము. ఉచిత ప్రయాణం వల్ల మహిళలు బయటకు రావడం, ఉపాధి, విద్య, వైద్య అవకాశాలను అందుకోవడం అనేది సమాజంలో ఒక గొప్ప మార్పు..

ఇక్కడ గమనించవలసిన మరో అంశం.. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి అందాల్సిన నిధులు సమయానికి రాకపోతే.. ఆ భారం సంస్థపై తీవ్రంగా పడుతుంది. కొత్త బస్సులు కొనాలన్నా, డ్రైవర్లు, కండక్టర్ల నియామకం జరగాలన్నా, డిపోల అభివృద్ధి జరగాలన్నా ఆర్టీసీ వద్ద తగినన్ని నిధులు ఉండాలి. ప్రయాణికులు పెరుగుతున్న కొద్దీ ఆర్టీసీ తన సామర్థ్యాన్ని కూడా అదే స్థాయిలో పెంచుకోకపోతే భవిష్యత్తులో ఆ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అదేవిధంగా ఉచితం పేరుతో బడ్జెట్‌లో వేల కోట్లు ఒకే పథకానికి వెచ్చిస్తున్నప్పుడు.. రైతులకు ఎరువులు, యువతకు ఉపాధి, ఆసుపత్రులకు నిధులు, విద్య, రోడ్ల అభివృద్ధి వంటి ఇతర ముఖ్యమైన రంగాలకు కూడా ప్రాధాన్యత తగ్గకుండా చూసుకోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. కాబట్టి మహిళలకు ఈ సంక్షేమ ప్రయోజనం అందుతూనే.. ఆర్టీసీకి ఆర్థిక భారం పడకుండా, బస్సుల సంఖ్య పెంచి సంస్థను ఎలా బలోపేతం చేయాలి? విద్యార్థులు, మధ్యతరగతి ప్రయాణికులపై అదనపు చార్జీల భారం పడకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా ఈ పథకాన్ని దీర్ఘకాలికంగా ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి? అనే కోణంలో ప్రభుత్వం చూపే ఆచరణాత్మక పరిష్కారాల పైనే తెలంగాణ ఆర్టీసీ భవిష్యత్తు, రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఆధారపడి ఉంటాయని అంటున్నారు..

ఇక ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించే ఉచిత పథకాలు ప్రకటించడం సులభమే. కానీ వాటి ఖర్చు మాత్రం ఆ ఒక్క ఎలక్షన్ తో ముగియదు. ప్రభుత్వం మారినా.. పథకాలు కొనసాగాల్సి వస్తే భవిష్యత్ బడ్జెట్‌పై భారం పడుతుంది. అప్పులు పెరగడం, అభివృద్ధి పనులకు నిధులు తగ్గడం, అవసరమైన మౌలిక వసతులపై పెట్టుబడులు వాయిదా పడటం, రాబోయే తరాల భవిష్యత్తు పై ఈ ఫలితాలు పడటం వంటి నష్టాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే ప్రభుత్వం ఉచితాలపై చేసే ఖర్చుకు ప్రతిఫలంగా రాష్ట్రానికి ఏం లభిస్తోంది? రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రంగాల అవసరాలను సమన్వయం చేసేలా ప్రభుత్వం వద్ద ఆర్థిక ప్రణాళికలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు..

#Telangana#Free bus scheme#women#state economy#congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి