Bommarasipet Lands: మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ మండల రెవెన్యూ కార్యాలయం దగ్గర బొమ్మరాసిపేట గ్రామ భూ బాధితుల ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ మద్దతు తెలిపాయి. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మల్లారెడ్డి వేర్వేరుగా పాల్గొన్నారు. భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా బొమ్మరాసిపేట రైతులు చేపట్టిన దీక్షలో పాల్గొన్న నేతలు.. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
బొమ్మరాసిపేటలో వెయ్యి ఎకరాల భూమిని దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 22ఏ చట్టంతో దోపిడీకి తెరలేపారని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కబ్జాలు, బాధలు అని ధ్వజమెత్తారు. బొమ్మరాసిపేట రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
బొమ్మరాసిపేట రైతులకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మద్దతుగా నిలిచారు. రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు ఈటల. బొమ్మరాసిపేట రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. 30ఏళ్ల కింద కొన్న భూములను నిషేధిత జాబితాలో ఎలా పెడతారని ఈటల ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిర్ణయాలతో హైదరాబాద్ నగరం చుట్టు పక్కల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు. పాలకుల ద్రోహాన్ని ప్రజలు మరిచిపోరన్న ఈటల.. ప్రజల జీవితాలతో చెలగాటమాడితే తిరుగుబాటు తప్పదని రేవంత్ సర్కార్ ను హెచ్చరించారు. రైతులకు అన్యాయం చేసే అవినీతి అధికారులకు ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు.
''రేవంత్ ప్రభుత్వం భూముల విలువ ఎక్కువ ఉన్న చోట దందా చేస్తోంది. 22ఏ పేరుతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. అధికారులు చట్టానికి లోబడి పని చేయాలి. బ్రోకర్ల డబ్బులకు ఆశపడి రైతులకు అన్యాయం చేయొద్దు. అవినీతి అధికారులకు ఎప్పటికైనా శిక్ష తప్పదు'' అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేట రైతులు భూ అక్రమాలకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. రెవెన్యూ అధికారులు, భూబకాసురులు కుమ్మక్కై రికార్డులు తారుమారు చేసి బొమ్మరాసిపేటలోని భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. వెయ్యి ఎకరాల భూమి కబ్జాకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. శామీర్ పేట రెవెన్యూ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన రైతులు.. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూ సమస్యలు వెంటనే పరిష్కరించి, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


