Bommarasipet Lands: మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేటలో భూ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారులు, భూ మాఫియా కుమ్మక్కై రికార్డులు తారుమారు చేసి బొమ్మరాసిపేటలోని భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. వెయ్యి ఎకరాల భూమి కబ్జాకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా శామీర్ పేట రెవెన్యూ ఆఫీస్ ముందు బొమ్మరాసిపేట రైతులు ధర్నా నిర్వహించారు. తమ భూ సమస్యలు వెంటనే పరిష్కరించి, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బొమ్మరాసిపేటలోని సర్వే నెంబర్ 323 నుంచి 409 మధ్య ఉన్న దాదాపు 1049 ఎకరాల భూమిని దాదాపు 400 మంది రైతులు 50ఏళ్లుగా రిజిస్ట్రర్ సేల్ డీడ్లతో భూములు సాగు చేసుకుంటున్నారని వారు తెలిపారు. ఇప్పుడు స్థానిక రెవెన్యూ అధికారులు, భూ కబ్జాదారులు కుమ్మక్కై ఏళ్ల నాటి పట్టా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు.
ఐదేళ్లుగా ఈ భూములపై లావాదేవీలు సైతం నిలిపివేశారని వాపోయారు. తమకు కనీసం నోటుసులు కూడా ఇవ్వకుండా భూములపై చర్యలు తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరణి, భూభారతి రికార్డుల్లో నిజమైన యజమానుల పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
బొమ్మరాసిపేట భూ వివాదంపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. రెవెన్యూ రికార్డులు, ప్రస్తుత రికార్డులను క్రాస్ వెరిఫై చేయాలని.. రిజిస్టర్డ్ పత్రాలు కలిగిన రైతుల హక్కులు కాపాడాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బొమ్మరాసిపేట రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, స్వేచ్ఛలో ''బొమ్మరాసిపేట భూముల స్కామ్ లో బాధలు ఎవరికి?'' అంటూ కథనం వచ్చింది. ఈ కథనానికి సంబంధించిన పేపర్లు ధర్నాలో కూర్చున్న రైతులు చేతుల్లో కనిపించాయి. వెయ్యి ఎకరాల భూమి కబ్జాకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పేందుకు ఇదిగో నిదర్శనం అంటూ స్వేచ్ఛ కథనం పేపర్లను రైతులు ధర్నాలో ప్రదర్శించారు.


