కాంగ్రెస్ చెబుతున్న లెక్కల ప్రకారం... గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ భారీ అప్పుల ఊబిలోకి వెళ్లిందని, లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వాటిని అభివృద్ధి కంటే ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే వినియోగించారని ఆరోపిస్తోంది.
అదే సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వాదనను పూర్తిగా కొట్టిపారేస్తోంది. కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో తెలంగాణ అప్పులపై ఒక లెక్క చెబుతుంటే... కాంగ్రెస్ మాత్రం ఏడు లక్షల కోట్లు, ఎనిమిది లక్షల కోట్లు అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని విమర్శిస్తోంది. అసలు నిజమైన లెక్క ఏదో ముందుగా చెప్పాలని ప్రశ్నిస్తోంది.
ఇక కాంగ్రెస్ హయాంలో తీసుకుంటున్న అప్పులు సంక్షేమం, అభివృద్ధి కోసమేనని అధికార పార్టీ సమర్థించుకుంటుంటే... పాలన చేతకాక, ఎన్నికల హామీలు అమలు చేయలేక గత ప్రభుత్వాన్నే నిందించడం కాంగ్రెస్‌కు అలవాటైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలన ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్రంపై అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి... మొత్తం 8 లక్షల 21 వేల 651 కోట్ల రూపాయల ఆర్థిక భారం మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
గన్ పార్క్ అమరవీరుల స్థూపం సాక్షిగా... ఈ పూర్తి లెక్కలను ఆయన మీడియా ముందుంచారు. నేను చెప్పిన లెక్కలు తప్పని.. కేసీఆర్ తో చెప్పించాలని, నా లెక్కలు తప్పని తేలితే రాజీనామాకు సిద్ధమనే మాటకు కట్టుబడి ఉన్నానని సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చేసిన సవాళ్లను స్వీకరించిన హరీష్ రావు, బీఆర్‌ఎస్ నాయకులు చర్చకు సిద్ధమని ప్రకటించారు. హరీష్ రావు ఇతర నాయకులతో కలిసి తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్‌కు బయలుదేరేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పోలీసులకు, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో, హరీష్ రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని... చర్చ నుంచి పారిపోవద్దని మంత్రులకు సవాల్ విసిరారు హరీష్ రావు. అయితే అనుమతి లేకపోవడంతో హరీష్ రావును గన్‌పార్క్‌కు వెళ్లనీయకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఒకవైపు పాత అప్పులపై కాంగ్రెస్ దాడి... మరోవైపు ప్రస్తుత పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ ప్రతిదాడి. ఇలా తెలంగాణ రాజకీయాల్లో అప్పుల లెక్కలు ఇప్పుడు రాజకీయ ఆయుధంగా మారిపోయాయి. అయితే ప్రజలు మాత్రం ఒకటే ప్రశ్న అడుగుతున్నారు...
అసలు నిజమైన అప్పు ఎంత? ఆ అప్పుతో రాష్ట్రానికి జరిగిన లాభం ఎంత? ఈ రెండు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కావాలని ఆశిస్తున్నారు. అయితే జనానికి సమాధానం చెప్పవలసిన నేతలు మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.












