ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అయోధ్య రామ మందిరంలో జరిగిన చోరీ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మోదీ, అమిత్‌షా స్పందించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయోధ్యలోనే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. రామ మందిర ట్రస్ట్ వ్యవహారాలు కూడా బీజేపీ నాయకత్వ పరిధిలోనే ఉన్నాయన్నారు. ఇంతకాలం రాముడి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే రాముడి గుడిలో చోరీ జరిగితే నోరు మెదపకపోవడంపై అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
రాముడిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారా? అని నిలదీశారు. రాముడి గుడిలో చోరీ ఘటన అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించాలన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండి ఉంటే బీజేపీ ఈ ఘటనపై పెద్దఎత్తున ఆందోళనలు చేసేదని అన్నారు.












