తెలంగాణ

రిటైర్డ్ ఐపీఎస్ కొడుకుపై కేసు నమోదు

రచన: Desk 24 నిమిషాల పఠనం

సినీ నిర్మాతను ఇన్వెస్టర్ల పేరుతో నమ్మించి మోసం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఏకే.ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్, దాడి కేసు నమోదు చేశారు.

సినీ నిర్మాతను ఇన్వెస్టర్ల పేరుతో నమ్మించి మోసం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఏకే.ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్, దాడి కేసు నమోదు చేశారు. రూ.50లక్షలు వసూలు చేయగా డబ్బులు తిరిగి అడిగినందుకు భౌతిక దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించాడు. రాజకీయ, ఉన్నతాధికారుల నేపథ్యం ఉన్న వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉండటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

బాధితుడు అనీష్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రెండేళ్లుగా మహారాజ్ఞి సినిమా నిర్మాణ పనుల్లో భాగంగా పెట్టుబడిదారుల కోసం చూస్తున్న తరుణంలో జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని సన్‌లిట్ గ్రూప్ కార్యాలయంలో మొహ్సిన్ ఖాన్, అతనికి బంధువైన తబ్రైజ్‌లతో పరిచయం ఏర్పడింది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను పరిచయం చేసి సినిమాకు భారీగా ఫండింగ్ ఇప్పిస్తామని వారు నమ్మబలికారు. ఈ మాటలు నమ్మి అనీష్ రెడ్డి 2025 ఆగస్టులో మొహ్సిన్‌కు రూ.25లక్షలు, తబ్రైజ్‌కు విడతల వారీగా రూ.25 లక్షలు ఇచ్చాడు.

అయితే నెలలు గడుస్తున్నా ఒక్క ఇన్వెస్టర్‌ను కూడా పరిచయం చేయకపోగా, అడిగినప్పుడల్లా కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ మోసంపై నిలదీసేందుకు నిర్మాత అనీష్ రెడ్డి జులై 1వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లోని సన్‌లిట్ గ్రూప్ ఆఫీసుకు వెళ్లాడు. ఆఫీసులో ఉన్న మొహ్సిన్ ఖాన్ బాధితుడిని ఒక గదిలోకి పిలిచి, తిరిగి డబ్బులు అడుగుతావా ఏం చేస్తావో చూస్తా అంటూ వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు.

అదే సమయంలో అక్కడ ఉన్న బౌన్సర్లు ఆయుధాలు చూపిస్తూ నిర్మాతను తీవ్రంగా బెదిరించడమే కాకుండా భౌతికదాడికి దిగారు. ఈ క్రమంలో నిందితుడు తబ్రైజ్ ఫోన్ లైన్ లో ఉండి మొహ్సిన్‌ను మరింతగా రెచ్చగొట్టినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితుడు మొహ్సిన్ ఖాన్ కేవలం మాజీ ఐపీఎస్ అధికారి కొడుకే కాకుండా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి అల్లుడు కూడా కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తబ్రైజ్ కూడా షబ్బీర్ అలీకి బంధువుగా సమాచారం.

#AK Khan#exipsson#Cheatingdirectorfilmmaker#Hyderabadpolice#Investors#JubileeHills
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి