బీఆర్‌ఎస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..
మంత్రుల సవాళ్లపై ఘాటు వ్యాఖ్యలు!
పోలీసుల పహారాలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా?
అక్రమ అరెస్టులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హరీష్ రావు ఫైర్!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య అప్పుల సవాళ్లు, ఆర్థిక పరిస్థితిపై నడుస్తున్న మాటల యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం (తెలంగాణ భవన్) వద్ద గురువారం భారీ ఎత్తున పోలీసులు మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య జరిగిన తీవ్ర తోపులాటలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు కింద పడిపోయారు.
ఈ ఘటనతో గులాబీ శ్రేణులు భగ్గుమన్నారు. రాష్ట్ర అప్పులు, ఆర్థిక శ్వేతపత్రంపై కాంగ్రెస్ మంత్రులు విసిరిన సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధమైన తమను, పోలీసులను అడ్డుపెట్టుకుని గృహనిర్బంధాలు చేయడంపై హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తోపులాట అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక పోలీసుల పహారాలో బతుకుతున్నామా?" అంటూ పాలకులను నిలదీశారు. సవాల్ విసిరిన మంత్రులు ఇప్పుడు చర్చకు రాకుండా పారిపోతున్నారని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. చేతనైతే సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలని, అంతేగానీ ఖాకీలను ముందుపెట్టి రాజకీయం చేయడం సరికాదని మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని రోడ్లపైకి రాకుండా నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ అనాగరిక పాలనకు నిదర్శనమని విమర్శించారు. అప్పుల వ్యవహారంలో తాము వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమయ్యామని, అందుకే ప్రభుత్వం భయపడి పోలీసులతో ఇళ్లను, పార్టీ ఆఫీసులను ముట్టడించిందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై గత కొన్ని రోజులుగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ మంత్రులు శ్వేతపత్రం విడుదల చేస్తూ బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయగా.. తాము చర్చకు సిద్ధమని, ఎక్కడో ఒకచోట బహిరంగ చర్చ పెడదామని హరీశ్ రావు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ సాక్షిగా ముఖాముఖి చర్చకు బయలుదేరడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేయడంతో తెలంగాణ భవన్ వద్ద ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది.












