న్యాయవాదుల వృత్తిలో పోలీసుల జోక్యంపై మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది.ఈ క్రమంలోనే నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు బార్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు రెట్టాల బాల్‌రాజ్ గౌడ్,ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రాజంపేట నాయకత్వంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వినతిపత్రం సమర్పించారు.
కోర్టు విధుల్లో ఉన్న కొందరు పోలీసు సిబ్బంది న్యాయవాదుల వృత్తి నిర్వహణలో అనవసర జోక్యం చేసుకుంటూ, కక్షిదారులను ప్రభావితం చేయడం, నిర్దిష్ట న్యాయవాదులను సూచించడం, అలాగే న్యాయవాదులు మరియు కక్షిదారులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, సంబంధిత పోలీసు సిబ్బందిపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని కోర్టు విధుల నుంచి బదిలీ చేయాలని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రెట్టాల బాల్‌రాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, బార్ అసోసియేషన్ కార్యవర్గం సీపీని కోరింది.న్యాయవాదుల వృత్తి స్వేచ్ఛను, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.












