SRR అక్రమ నిర్మాణల పై హైడ్రా ఫోకస్
మూడు టవర్స్ ఇల్లీగల్ గా గుర్తింపు
బాబు పేరుతో రూ.50 కోట్ల దందా
స్వేచ్ఛ న్యూస్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్!
హైదరాబాద్ నగరంలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) తాజాగా ఎస్‌ఆర్‌ఆర్ (SRR) అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఎస్‌ఆర్‌ఆర్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల్లోని మూడు టవర్లు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా, ఇల్లీగల్‌గా నిర్మించినట్లు అధికారికంగా గుర్తించారు. తాజాగా బయటపడుతున్న లీగల్ వివాదాలు, రాజకీయ పైరవీలు, బెదిరింపుల పర్వంతో ఈ మెగా ప్రాజెక్ట్స్ వెనుక ఉన్న భారీ మోసాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి.
ఎస్ఆర్ఆర్ లంచాలపై తెలంగాణ జీఏడీకి నేడో, రేపో నార్సింగి పోలీసులు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వివాదంలో తన ప్రమేయం లేకుండానే టైటిల్ బదిలీ అయిపోయిందంటూ కోనేరు శ్రీరాములు కుమారుడు కోనేరు నాగేశ్వరరావు కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, మోసాల చిట్టాను ఆయన రాజశేఖర్ అనే వ్యక్తికి ఈ-మెయిల్ రూపంలో పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజశేఖర్ అనే వ్యక్తి ప్లాట్ ఓనర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా "పైసా కొడితే అందరూ 'జీ హుజూర్' అంటారు!" అంటూ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఈ అక్రమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు నాడు ఏకంగా రూ.50 కోట్లు లంచం ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును అడ్డం పెట్టుకుని, తాము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఈ దందా నడిపించినట్లు 'స్వేచ్ఛ న్యూస్' ఇన్వేస్టిగేషన్‌లో తేలింది. ఇటీవల ‘స్వేచ్ఛ’లో వెలువడిన కథనంతో ఈ మెగా ప్రాజెక్ట్స్ మోసాలు, భూదందాలు రాష్ట్రవ్యాప్తంగా బట్టబయలయ్యాయి.
దీంతో బాధితులంతా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అల్లూరి శ్రీనివాస్ సాగిస్తున్న అంతులేని కబ్జాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం "ఆంధ్ర లాబీయిస్టులు వర్సెస్ తెలంగాణ సామాన్యుడు" గా మారింది. సామాన్యుల భూములను అక్రమంగా లాక్కుంటూ, అధికారులను మేనేజ్ చేయాలని చూస్తున్న ఈ ముఠా ఆట కట్టించేందుకు ‘హైడ్రా’ రంగంలోకి దిగడంతో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.












