రైతు లేకపోతే మనిషికి మనుగడ లేదని అంటారు.. పంటలు చక్కగా పండితేనే లోకానికి అన్నం.. రైతుకు లాభం.. కానీ వరుణుడు కనికరించకపోతే అన్నదాత పరిస్థితి అయోమయంగా మారుతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నది.. వానకాలం సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు జులై, ఆగస్టు నెలలపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. జులై నెలలోనూ పెద్దగా వర్షాలు ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ రెండు రోజులు కొన్ని జిల్లాల్లో మాత్రం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు గత జూన్ లో ఏకంగా 17 శాతం జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
దీనికి ప్రధాన కారణం ఎల్ నినో ఎఫెక్ట్, అలాగే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రాష్ట్రాన్ని తాకడమేనని నిపుణులు చెప్తున్నారు. ముందస్తుగా విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు వాన కోసం ఎదురుచూస్తున్నారు. మరి జులై, ఆగస్టు నెలల్లోనైనా అన్నదాతను వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి..










