చాలా మంది ఇళ్లల్లో వారంలో రెండు మూడుసార్లు ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చికెన్ ప్రియులు ముక్క ముట్టుకోవాలన్నా, గుడ్డు తినాలన్నా జేబులు ఖాళీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చికెన్, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
గత వారం రోజుల క్రితం వరకు మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కేజీ రూ.280 నుంచి రూ.300 మధ్యలో ఉండేది. ప్రస్తుతం ఆ రేట్లు మరింత కొండెక్కాయి. హైదరాబాద్ లోని వివిధ ఏరియాలను బట్టి ప్రస్తుతం కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.300 నుంచి రూ.330 వరకు పలుకుతోంది. ఏపీలోని విజయవాడలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కేజీ చికెన్ కొనాలంటే రూ.320 నుండి రూ.330 వరకు చెల్లించాల్సి వస్తోంది.
సామాన్యుడికి ఏకైక ప్రొటీన్ ఆహారమైన కోడిగుడ్డు ధర కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. నెల రోజుల కిందట ఒక్కో కోడిగుడ్డు ధర కేవలం రూ.6 నుంచి రూ.7 మధ్యలో ఉండేది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో హోల్ సేల్ షాపుల్లోనే ఒక్కో గుడ్డు రూ.8కి విక్రయిస్తున్నారు. ఇక రిటైల్ ధరలు రూ.9వరకు పలుకుతోంది. పౌల్ట్రీ ఫారాలలో కోళ్ల మేత (దాణా) ఖర్చులు పెరగడం, రవాణా ఛార్జీల భారం, ఎండల ప్రభావం లేదా వాతావరణ మార్పుల వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గడం ధరల పెంపునకు మరో కారణంగా వ్యాపారులు చెప్తున్నారు.












