తెలంగాణలో రాజకీయ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతల భద్రతను పోలీసు శాఖ ఉన్నట్టుండి భారీగా తగ్గించింది. మొత్తం 70 మందికి పైగా రాజకీయ నాయకుల సెక్యూరిటీని కుదిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒకేసారి ఇంతమంది నేతల భద్రతను కుదించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భద్రత కోల్పోయిన ముఖ్య నేతల వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ మేయర్ భర్త బుర్రి శ్రీనివాస్ రెడ్డికు ఉన్న '2+2' గన్‌మెన్ల రక్షణను పూర్తిగా తొలగించారు. అదేవిధంగా నకిరేకల్ కాంగ్రెస్ నాయకుడు నేతి విద్యాసాగర్‌కు కేటాయించిన '1+1' సెక్యూరిటీని అధికారులు రద్దు చేశారు. వీరితో పాటు నల్గొండ బీజేపీ నేతలు వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డిలకు ఉన్న గన్‌మెన్లను కూడా పోలీసు శాఖ వెనక్కి తీసుకుంది.












