నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. జులై 3 నుంచి జులై 9 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. రాబోయే ఏడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాలతో పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జులై 9 వరకు విడతల వారీగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
జూలై 3 నుంచి 4వ తేదీ వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా 4 నుంచి 5వ తేదీ వరకు ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. 5 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నిరంతరాయంగా కురుస్తూనే ఉంటాయి.
ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకోనున్నాయి. కోస్తాంధ్రాలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అయితే, రాబోయే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి పెద్ద మార్పులు ఉండబోవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.












