అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్ యాత్ర(గురువారం) ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటన చేశాయి. భక్తులు ‘హర హర మహాదేవ్’ నినాదాలతో యాత్రను ప్రారంభించారు. భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి మొదటి గ్రూప్ యాత్రికులు బయల్దేరారు. వీరిలో 4,800 మందికి పైగా భక్తులు 259 వాహనాల్లో బయల్దేరారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే తొలిరోజు అనూహ్యంగా భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. వర్షం నీటికి కొండ మార్గాలు జారుడుగా మారాయి. అయినప్పటికీ ప్రతికూల వాతావరణాన్ని లెక్క చేయకుండా భక్తులు యాత్రను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటించాలని యాత్రికులను అధికారులు కోరారు.
కాగా అమర్ నాథ్ యాత్ర 57రోజుల పాటు కొనసాగనుంది. హిమలింగ దర్శనానికి ఇప్పటికే సుమారు 4లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమర్ నాథ్ యాత్ర అత్యంత సంక్లిష్టమైనది. హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తున అమర్‌నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగం కొలువై ఉంది. శివలింగాన్ని దర్శించడానికి లక్షల మంది భక్తులు ఈ సాహసోపేతమైన యాత్రను ఎంచుకుంటున్నారు.












