ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా- ఇరాన్ నడుమ సీజ్ ఫైర్ కొనసాగుతోంది. ఇరుదేశాల నడుమ పీస్ డీల్ సైతం కుదిరింది. దీనిపై 60 రోజుల్లో సంతకాలు జరగనున్నాయి.ఇప్పటికే ఇరుదేశాల ప్రతినిధులు పలుమార్లు సమావేశం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి తెరిచే ఉండటంతో ఆయిల్, గ్యాస్ నౌకలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇప్పటికే పలు నౌకలు భారత తీరాలకు చేరుకున్నాయి.దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు యుద్ధానికి పూర్వం ఉన్న ధరకు చేరుకోవడంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా దీనిపై పెట్రోలియం శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు.
పెట్రోల్,డీజిల్ ధరలను ఎప్పుడు తగ్గిస్తారని ఓ సమావేశంలో మీడియా వారు ప్రశ్నించగా.. కేవలం కొన్ని రోజుల పాటు ముడి చమురు ధరలు తగ్గగానే దేశీయంగా రిటైల్ ధరలను తగ్గించడం సాధ్యం కాదని, రాబోయే కొన్ని వారాల పాటు అంతర్జాతీయంగా ఈ తక్కువ ధరలు నిలకడగా కొనసాగినప్పుడు మాత్రమే ధరల తగ్గింపు కుదురుతుందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు ధర కొన్ని సందర్భాల్లో బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువకు పడిపోవడంతో ఫ్యూయల్ ధరలు తగ్గుతాయని అంతా ఆశించారు. కాగా, నయారా అనే ప్రైవేట్ ఫ్యూయల్ కంపెనీ లీటర్ పెట్రోల్ పై రూ.5, లీటర్ డీజిల్ పై రూ.3 తగ్గించిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సైతం తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.












