బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. మొన్నటివరకు వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజు భారీగా ధరలు పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు కొత్త రికార్డులను సృష్టించాయి.తాజాగా పెరిగిన ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం)బంగారం ధర ఏకంగా రూ. 3,220 పెరిగి రూ. 1,47,000లకు చేరుకుంది. గడిచిన కేవలం రెండు రోజుల్లోనే పసిడి ధర ఏకంగా రూ. 6,220 పెరగడం గమనార్హం.
ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర కూడా రూ.2,950 ఎగబాకి ప్రస్తుతం రూ. 1,34,750 పలుకుతోంది. పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో కేజీ వెండి ధర ఒకే రోజు ఏకంగా రూ.10,000 పెరిగి రూ. 2,60,000కు చేరుకుంది. లోకల్ పన్నులు, నగల దుకాణాల మేకింగ్ చార్జెస్ బట్టి నగరంలోని వివిధ ప్రాంతాలలో ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. కాగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం సానుకూల పరిస్థితులు కనిపిస్తుండటంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.












