రాష్ట్రంలో కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు రేవంత్ సర్కార్.. ఈవీలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్టీసీలో విడతల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నది.ఫలితంగా ఇంధనం వాడకం కూడా తగ్గి కాలుష్యం తగ్గుతుందని భావిస్తోంది. అయితే, ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
ఎలక్ట్రికల్ బస్సుల్లో వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూట్లలో నడుస్తున్న జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం కింద పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్డెక్కిన ఈ జేబీఎం బస్సుల్లో వరుసగా హై వోల్టేజీ బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్టు సాంకేతిక నిపుణులు గుర్తించారు.
ఈ క్రమంలోనే ప్రయాణికుల భద్రతను దృష్ట్యా,ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. గత జూన్ నెలలో వారం రోజుల వ్యవధిలోనే కరీంనగర్ డిపో పరిధిలో రెండు వేర్వేరు జేబీఎం ఎలక్ట్రికల్ బస్సుల్లో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.దీంతో బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులు, సాంకేతిక బృందాలు వచ్చి ప్రతీ బస్సులోని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS), థర్మల్ రక్షణ వ్యవస్థలపై పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి,ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చే వరకు ఈ బస్సులు షెడ్లకే పరిమితం అవుతాయని సమాచారం.












