స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం.. తెలంగాణలో మరోసారి పొలిటికల్ వార్‌కు వేదికగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు.. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ.. ఉద్యోగాలు, రేషన్ కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుబంధు, రుణమాఫీ వరకు ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఒకప్పుడు రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సంగారెడ్డి సభలో 420 మాటలు మాట్లాడారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడం తనకు ఇబ్బందిగా ఉన్నా.. సీఎం చేసిన వ్యాఖ్యలకు స్పందించక తప్పడం లేదన్నారు. దీంతో రేవంత్ చేసిన విమర్శలకు.. హరీష్ రావు ఇచ్చిన కౌంటర్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందనే విషయంలో సీఎం రేవంత్ రెడ్డికే క్లారిటీ లేదని హరీష్ రావు విమర్శించారు.. అసెంబ్లీలో 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన సీఎం.. సంగారెడ్డి సభలో ఏకంగా 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరమని అన్నారు.. ఉద్యోగాల సంఖ్యపై ఇంత వ్యత్యాసం ఎందుకని నిలదీశారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ హామీని నిలబెట్టుకోలేదని హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్.. చివరకు జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిందని విమర్శించారు. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. దమ్ముంటే గన్‌మెన్లు లేకుండా అశోక్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీ వద్దకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు.
యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగులే ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెబుతారని అన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాకు కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏం చేసిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్క కిలోమీటర్ రోడ్డైనా వేశారా అని ప్రశ్నించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల గురించి సీఎం ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రాజెక్టుల ప్రస్తావన లేకుండా సంగారెడ్డి సభలో కేవలం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు.
ఇక బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదని చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. ఒకే అంశంపై ప్రభుత్వంలోనే భిన్నమైన మాటలు వినిపిస్తున్నాయని హరీష్ రావు విమర్శించారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్స్ పై కూడా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
గత రెండేళ్ల బకాయిల పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఇతర బకాయిలను కూడా చెల్లించామని పేర్కొన్నారు. గడిచిన రెండున్నరేళ్ల బకాయిలను పెండింగ్‌లో ఉంచి విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు కంటే కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువే ఇచ్చిందని ఆరోపించారు. 2020-21లో రూ.14,656 కోట్లు, 2021-22లో రూ.14,772 కోట్లు, 2022-23లో రూ.14,743 కోట్లు రైతుబంధుగా ఇచ్చామని వివరించారు.
అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024-25లో రూ.5,057 కోట్లు, 2025-26లో రూ.11 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ లెక్కల ప్రకారం రైతుబంధును పెంచి ఇచ్చారా? లేక గతంలో ఉన్న మొత్తాన్నే తగ్గించారా? అని సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా రైతుబంధు విషయంలో తాను చెప్పిన లెక్కలు తప్పయితే ముక్కు నేలకు రాస్తానని అన్నారు.
తన లెక్కలు తప్పుకాకపోతే సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తారా అంటూ ప్రతిసవాల్ విసిరారు. అలాగే రైతులకు ఇచ్చిన హామీల విషయంలో కూడా మోసం చేశారని ఆరోపించారు. కాగా హరీష్ రావు లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ ఎలాంటి సమాధానం ఇస్తుంది? రాజకీయంగా రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుంది? అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


