Cm Revanth: రేషన్ కార్డు కేవలం ప్లాస్టిక్ వస్తువు కాదు, ఉచితంగా బియ్యం తెచ్చి పెట్టే సాధనం కాదు.. పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలు ఎవరి ముందు చెయ్యి చాచి నిలబడాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదనే సంకల్పంతో.. దేశంలో పేదలకు నిత్యవసర వస్తువులు పంచేందుకు రేషన్ షాపులు కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు.
నాడు మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన ఇందిరా గాంధీ దేశానికి ఎంతో చేశారని రేవంత్ చెప్పారు. పేదల సంక్షేమం కోసం, వారి ఆత్మగౌరవం కోసం ఇందిరాగాంధీ అహర్నిశలూ శ్రమించారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో పాలన సాగిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపుగా తీసుకెళ్తున్నామన్నారు. 12 ఏళ్ల బీజేపీ పాలన, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలన పోల్చి చూడాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ బొరుసు..
ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీలు వేరు వేరు కాదన్నారు. నాణేనికి బొమ్మ బొరుసు లాంటి వాళ్లే బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అనేక రకాలుగా మాట్లాడుతున్న ఆ రెండు పార్టీల నాయకులు.. ఎన్నడైనా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని, పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టాలని కలలోనైనా ఆలోచన చేశారా? అని రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో మీరిచ్చిన దొడ్డు బియ్యం ఏనాడైనా పేదలు వండుకుని తిన్నారా? అని రేవంత్ నిలదీశారు.
సన్నబియ్యం ఇవ్వాలని కలలోనైనా ఆలోచించారా?
మీరిచ్చిన దొడ్డు బియ్యం పశువుల దాణా కోసమో, కోళ్ల దాణా కోసమో, విత్తనాల తయారీ కోసమో, బీర్ల కంపెనీల కోసమో అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు. కానీ, నేటి ప్రజా ప్రభుత్వంలో మేమిచ్చిన సన్న బియ్యాన్ని కుటుంబం మొత్తం కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు. రేషన్ పాపుల్లో ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం కారణంగానే మార్కెట్‌లో బియ్యం రేట్లు తగ్గాయని చెప్పారు. ఇవాళ 3కోట్ల 48 లక్షల మందికి.. ప్రతి నెల 2లక్షల 16వేల క్వింటాళ్ల సన్నబియ్యాన్ని ఇంటికే తెచ్చిస్తున్నామన్నారు. 17వేలకు పైగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని ప్రచారం చేశారు.. మరి ఏనాడైనా పోయిందా?’’ అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మారుమూల పల్లెల్లోనూ ఉచిత కరెంటు ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? అని రేవంత్ అడిగారు.
రైతు రాజైంది కాంగ్రెస్ హయాంలోనే..
రైతు రాజు అయ్యింది కాంగ్రెస్ హయాంలోనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 500 రూపాయల బోనస్ ఇచ్చి మరీ వడ్లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 37 నెలల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 36 వేల కోట్ల రూపాయల రైతు బంధు నిధులు వేశామని వెల్లడించారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రైతు రుణమాఫీ చేయలేదన్న రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రైతు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. 32 నెలల్లో వడ్లు కొని రూ.90 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.35 వేల కోట్లు చెల్లిస్తున్నామన్నారు. మొత్తంగా అన్నదాతల కోసం ఇప్పటివరకు లక్షా 75వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్ తెలిపారు.
మీకు ఉద్యోగాలిచ్చే బాధ్యత మాది..
ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తన కుటుంబ సభ్యులకు, బంధువులకు ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్.. మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రజా పాలనలో మాత్రం 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్లు వస్తాయన్నారు. నిరుద్యోగులు ఎవరి ప్రలోభాలకు గురికాకుండా కేవలం చదువు మీద దృష్టి పెట్టాలని సూచించారు. మీకు ఉద్యోగాలిచ్చే బాధ్యత మాది అని భరోసా ఇచ్చారు.












