* అసెంబ్లీకి రా.. మాట్లాడుదాం అంటూ కేసీఆర్ కు సవాల్
* 2034 వరకు మీ ఆశీర్వాదం కావాలి
* “3.48 కోట్ల మందికి సన్నబియ్యం”
* 70 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా
* వరి వేస్తే ఉరి అన్న వారే ఫామ్‌హౌస్‌లో వరి వేశారు
* జగ్గారెడ్డి తెలంగాణలో నంబర్ వన్ నాయకుడు, ఆయనను కాపాడుకునే బాధ్యత మీది
* జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలో రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారు
* సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth: బీజేపీ-బీఆర్‌ఎస్ నాణానికి బొమ్మ-బొరుసు లాంటివని.. వారి మాయలో ప్రజలు పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ''కేసీఆర్ అసెంబ్లీకి రా.. మాట్లాడుదాం” అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలంగాణలో నంబర్‌వన్ నాయకుడు అని, ఆయనను కాపాడుకునే బాధ్యత మీది అని రేవంత్ అన్నారు. జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలో రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన భారీ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, ఇందిరమ్మ ఇళ్లపై సుదీర్ఘంగా మాట్లాడారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని చెబుతూ ఆయనకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. తన ప్రసంగంలో ప్రధానంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లను టార్గెట్ చేశారు. రెండు పార్టీలు వేర్వేరుగా కనిపిస్తున్నా రాజకీయంగా ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ''బీజేపీ, బీఆర్‌ఎస్ వేర్వేరు కాదు.. నాణానికి బొమ్మ-బొరుసు లాంటివి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదల కడుపు నింపేందుకు ఈ రెండు పార్టీలు ఏనాడైనా ఆలోచించాయా అని ప్రశ్నించారు.
వారి మాయలో పడకండి
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ''దమ్ముంటే అసెంబ్లీకి రా.. మాట్లాడుదాం” అని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలే తేడాను గమనించాలని కోరారు. ప్రతిపక్ష నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ బీఆర్ఎస్ లీడర్ పెట్రోల్ బాటిల్ పట్టుకుని డ్రామాలు చేశారని విమర్శించారు. “రూ.100 పెట్రోల్ తెచ్చి.. అగ్గిపెట్టె మర్చిపోయారా?” అంటూ ఎద్దేవా చేశారు. విద్యార్థులను రెచ్చగొట్టి వారి శవాల పునాదులపై అధికారంలోకి రావాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ''వాళ్లు మాయ లేడీలు.. మాయగాళ్లు.. వారి మాయలో పడకండి” అంటూ ప్రజలకు సూచించారు.
కరువు రావాలని అఘోరా పూజలు
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల సందర్భంగా అఘోరా పూజల అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. “ఒకాయన కరువు రావాలని, రైతులు చనిపోవాలని అఘోరా పూజలు చేశారు” అని ఆరోపించారు. తనపై, పీసీసీ చీఫ్‌పై చేతబడులు చేస్తే ఏమీ కాదని, కానీ రాష్ట్రానికి కీడు కోరుకోవడం ఏంటని ప్రశ్నించారు. శివమొగ్గ గుడిలో పూజలు చేసిన ఫొటోలను ఎందుకు బయటపెట్టలేదని సీఎం ప్రశ్నించారు. తమిళనాడులోని ఆలయాల్లో జరిగే అఘోరా పూజలపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలపై సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మీ బతుకమ్మ చీరలు పొలాల వద్ద అడవి పందులను బెదిరించడానికి పని చేశాయి” అంటూ విమర్శించారు. బతుకమ్మ చీరల పంపిణీలో కమిషన్లు తీసుకున్న వారు కూడా తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల హామీపై సీఎం రేవంత్ నిలదీశారు. ఏ ఊరిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టారో అక్కడే మీరు ఓట్లు అడగండి. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ఊరిలో నేను ఓట్లు అడుగుతా” అని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను ఊరించి మోసగించారని ఆరోపించారు.
జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం..
“జగ్గారెడ్డి 30 ఏళ్ల నుంచి నా దోస్తు. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ నాయకుడు'' అని సీఎం రేవంత్ కితాబిచ్చారు. జగ్గారెడ్డి ప్రజా జీవితంలో కొనసాగాలని, ఆయనను కాపాడుకునే బాధ్యత సంగారెడ్డి ప్రజలదేనని చెప్పారు. “జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారు” అని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి మరోసారి తాను పోటీ చేయనని చెబితే వారం రోజుల పాటు ఇంట్లో పెట్టి తాళం వేయాలని సరదాగా వ్యాఖ్యానించారు. “రూ.1,000 కోట్లు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి నాయకుడు దొరకడు” అని సీఎం అన్నారు.
రేషన్ వ్యవస్థను తెచ్చిందే కాంగ్రెస్
రేషన్ కార్డు కేవలం ప్లాస్టిక్ వస్తువు కాదన్నారు రేవంత్. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదు” అనే లక్ష్యంతో రేషన్ వ్యవస్థను కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. ఇందిరా గాంధీని మెదక్ ఎంపీగా గెలిపిస్తే ప్రధాని అయ్యారని, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
“3.48 కోట్ల మందికి సన్నబియ్యం”
తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని సీఎం తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ ద్వారా పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యంపై విమర్శలు గుప్పించారు. ఆ బియ్యాన్ని ప్రజలు పశువులకు దాణాగా ఉపయోగించారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు రూ.500 బోనస్ ఇస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి పేదలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆనాడు వ్యవసాయాన్ని దండగ అన్నారు.. ఇప్పుడు వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తున్నామన్నారు.
70 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా..
రైతు బంధు నిలిపివేయలేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రూ.2 వేలు పెంచి రైతు భరోసా అందిస్తున్నామని తెలిపారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వెల్లడించారు. ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, తెలంగాణలో అప్పుల భారం లేని రైతులను తయారు చేశామని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. 32 నెలల్లో రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. పంటల కొనుగోలు, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీని కోసం ఏడాదికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని.. ఉచిత విద్యుత్‌తో రైతులు ఆనందంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి పేర్కొననారు.
వరి వేస్తే ఉరి అన్నవారే ఫామ్‌హౌస్‌లో వరి వేశారు..
గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. రైతులకు వరి వేయొద్దని చెప్పిన వారే తమ ఫామ్‌హౌస్‌లలో వరి పండించి కంపెనీలకు అమ్ముకున్నారని సీఎం ఆరోపించారు. రైతులను ఒకలా, తాము మరోలా చూసుకున్నారని విమర్శించారు. మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని సీఎం చెప్పారు. 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుపై ఇచ్చామని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఐదేళ్ల పాటు మహిళలకు మంత్రి పదవి ఇవ్వని వారు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటుందన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు.. ప్రతిపక్షాలపై ఫైర్
ఉద్యోగాల పేరుతో గత ప్రభుత్వం యువతను మోసం చేసిందని సీఎం రేవంత్ ఆరోపించారు. “మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం” అని తెలిపారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
విధ్వంసం నుంచి వికాసం వైపు..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ తెలిపారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో ఒక్కోసారి ఆలస్యం కావచ్చని, కానీ ప్రజల హక్కులకు భంగం కలగనివ్వబోమని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచాలని కోరారు.
కులగణనపై సీఎం
దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్‌రెడ్డి తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
2034 వరకు మీ ఆశీర్వాదం కావాలి
ప్రజల ఆశీర్వాదం తమకు కొనసాగాలని సీఎం కోరారు. “2034 వరకు మీ ఆశీర్వాదం ఉండాలి. మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు” అని అన్నారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, నిర్మల జగ్గారెడ్డి, జగ్గారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












