* అభివృద్ధిపై ఒక్క మాటా లేదు
* రుణమాఫీపై సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్
* “గన్‌మెన్లు లేకుండా నీ ఊరికి వస్తా.. వంద శాతం రుణమాఫీ జరిగిందని తేలితే నేనే రాజీనామా చేస్తా”
* రైతుబంధులో రూ.15వేల కోట్లు ఎగ్గొట్టారు
* 24 గంటల ఉచిత విద్యుత్ ఎక్కడ? లాగ్‌బుక్స్ పరిశీలిస్తే 10-11 గంటలకే పరిమితం
* ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో విద్యార్థుల భవిష్యత్ నాశనం
* 70 వేల ఉద్యోగాల మాట పచ్చి అబద్ధం.. అసెంబ్లీలో చెప్పింది 16 వేలే
* రైతుబంధు, రుణమాఫీ, ఉద్యోగాలు, ఉచిత కరెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా?
Harish Rao: సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయాలకు దిగుతూ పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. శనివారం సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
''కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. సంగారెడ్డి సభలో సీఎం రేవంత్ సరిగ్గా సాయంత్రం 4.20 గంటలకు ప్రసంగం ప్రారంభించి, 420 మాటలే మాట్లాడారు'' అని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున గాంధీ, పటేల్, నెహ్రూ వంటి మహనీయులను స్మరించుకోవాల్సింది పోయి రాజకీయ విమర్శలకు దిగడం సరికాదన్నారు.
అభివృద్ధిపై ఒక్క మాటా చెప్పలేదు
కేసీఆర్ హయాంలో ఆగస్టు 15న సాగునీరు, విద్యుత్, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడేవారని, కానీ సంగారెడ్డి సభలో రేవంత్‌రెడ్డి ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా చెప్పలేదని హరీశ్‌రావు అన్నారు. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టు నీటిని ఖాళీ చేశారని ఆరోపించారు. నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సాగునీటి కోసం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ఈ మూడేళ్లలో మూలకు పడేశారని హరీశ్‌రావు విమర్శించారు. జహీరాబాద్‌కు ఏడాది క్రితం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేశారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రోడ్లే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదని హరీశ్‌రావు మండిపడ్డారు.
రేషన్ కార్డులపై పచ్చి అబద్ధాలు
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చి 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు చెప్పారని హరీశ్ గుర్తుచేశారు. కానీ సీఎం మాత్రం బహిరంగ సభల్లో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బియ్యం పంపిణీలో బీఆర్ఎస్ ఘనత
కాంగ్రెస్ హయాంలో మనిషికి నాలుగు కిలోలు, కుటుంబానికి 20 కిలోల సీలింగ్ ఉండేదని, కేసీఆర్ ప్రభుత్వం ఆ సీలింగ్‌ను ఎత్తివేసి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందించిందని హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 16వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాధానం వచ్చిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ సభలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. దీనిపై సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ 2లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?
ఒక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్‌నగర్ లైబ్రరీ సాక్షిగా హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని హరీశ్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే గన్‌మెన్లను వదిలేసి అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాలకు రావాలని సవాల్ చేశారు. గత రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా సుమారు 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీశారని హరీశ్‌రావు ఆరోపించారు. గత బకాయిల పరిస్థితిపై సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దమ్ముంటే.. గన్ మెన్లు లేకుండా రా..
''కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ రైతుబంధు ఇచ్చామని సీఎం చెబుతున్నారు. 2022-23లో కేసీఆర్ ప్రభుత్వం రూ.14,743 కోట్లు ఇచ్చింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2024-25లో రూ.5,557 కోట్లు, 2025-26లో రూ.11,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి సుమారు రూ.15వేల కోట్లు తక్కువగా ఇచ్చారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టు పెట్టి రైతులను మోసం చేశారు. రుణమాఫీ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించామని అసెంబ్లీలో చెప్పి, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన రూ.15 వేల కోట్ల పరిస్థితి ఏంటి? రేవంత్‌కి దమ్ముంటే గన్‌మెన్లు లేకుండా నా సవాల్ స్వీకరించాలి. నీ ఊరికి వస్తా. అక్కడ అందరికీ వంద శాతం రుణమాఫీ జరిగిందని తేలితే అక్కడే రాజీనామా చేస్తా. లేదంటే నువ్వు రాజీనామా చేస్తావా?” అని సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు హరీశ్‌రావు.
24 గంటల కరెంట్ ఎక్కడ?
రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం చెబుతున్నారు.. కానీ రాఘవాపూర్, నర్సాపూర్, బొమ్మల రామారం సబ్‌స్టేషన్ల లాగ్‌బుక్స్‌ను నేను పరిశీలించా. ఎక్కడా వ్యవసాయానికి 10-11 గంటలకు మించి త్రీ-ఫేజ్ విద్యుత్ రావడం లేదు.
యూరియా, డీఏపీ కోసం రైతుల అరిగోస
యూరియా, డీఏపీ ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ యాప్‌లో బుక్ చేసుకునే సమయంలో నర్మెట్ట, వెంకటాపూర్ వంటి గ్రామాల పేర్లు కూడా కనిపించని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో లక్షకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కనెక్షన్ల ధర రెట్టింపు చేసినా మెటీరియల్ లేదని అధికారులు చెబుతున్నారు.
వడ్ల బస్తాకు 3 నుంచి 5 కిలోల తరుగు
''తరుగు తీయబోమని చెప్పిన ప్రభుత్వం వడ్ల బస్తాకు 3 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తోంది. రెండు యాసంగి పంటలకు బోనస్ కూడా ఎగ్గొట్టారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి 32 నెలలు గడిచినా ఒక్కరికీ ఇవ్వలేదు. ఈ లెక్కన ప్రతి మహిళకు ప్రభుత్వం రూ.80 వేల వరకు బాకీ పడింది. అలాగే 4వేల మంది మహిళలకు బీమా పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వంలో దోపిడీ, కమీషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, సీనియర్ నేతలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్ మాట్లాడుతున్నారు. మీ పార్టీ నాయకులు చెబుతున్న నిజాలు మీకు వినిపించడం లేదా?” అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు హరీవ్ రావు.
రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతుబంధు, ఉద్యోగాలు, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్ అంశాలపై అసెంబ్లీ సాక్షిగా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జిల్లాకు వచ్చినప్పుడు రోడ్లు, తాగునీరు, పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై సీఎం మాట్లాడాలని అన్నారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయలేరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు.


