నాన్ వెజ్ ప్రియులకు శ్రావణ మాసం వస్తే పండగే.. నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న నాన్ వెజ్ ధరలు.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలపై శ్రావణమాసం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పవిత్రమైన శ్రావణమాసం ప్రారంభం కావడంతో చాలామంది భక్తులు నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటున్నారు.
దీంతో ఒక్కసారిగా చికెన్‌కు డిమాండ్ తగ్గిపోవడంతో మార్కెట్‌లో కోడి మాంసం ధరలు భారీగా పడిపోయాయి. గత పది, పదిహేను రోజుల క్రితం వరకు చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. ముఖ్యంగా స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.280 నుంచి రూ.310 వరకు పలికింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కూడా కనిపించాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, అనకాపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర సుమారు రూ.220 నుంచి రూ.240 మధ్యకు చేరింది. అంటే పది రోజుల క్రితం ఉన్న గరిష్ఠ ధరతో పోలిస్తే కిలోకు దాదాపు రూ.70 నుంచి రూ.90 వరకు తగ్గుదల కనిపిస్తోంది. అలాగే తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్ తదితర నగరాలు, పట్టణ ప్రాంతాల్లో చికెన్ ధరలు ప్రస్తుతం కిలో రూ.230 నుంచి రూ.250 మధ్యలో ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే గణనీయమైన తగ్గుదల నమోదైంది.
ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డిమాండ్ తగ్గడమేనని వ్యాపారులు చెబుతున్నారు. శ్రావణమాసంలో చాలామంది నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటంతో చికెన్ కొనుగోళ్లు తగ్గిపోయాయని అంటున్నారు. దీంతో మార్కెట్‌లో గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు ధరలను తగ్గించి విక్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మరోవైపు సాధారణ రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా కనిపించే చికెన్ షాపులు.. ప్రస్తుతం కస్టమర్లు లేక ఖాళీగా కనిపిస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. శ్రావణమాసం ప్రభావంతో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని చెబుతున్నారు.
అయితే ధరలు తగ్గడంతో నాన్‌వెజ్‌కు దూరంగా ఉండలేని మాంసం ప్రియులు మాత్రం మళ్లీ చికెన్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కిలోకు రూ.300 దాటిన ధర.. ఇప్పుడు రూ.220 నుంచి రూ.250 పరిధిలోకి రావడంతో కొంతమేర కొనుగోళ్లు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. మొత్తంగా చూస్తే.. పది రోజుల క్రితం వరకు వినియోగదారులకు భారంగా మారిన చికెన్ ధరలు, ఇప్పుడు శ్రావణమాసం ప్రభావంతో ఒక్కసారిగా దిగివచ్చాయి.


