తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకంపై స్పష్టత ఇచ్చింది. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం గడువు ఆగస్టు 13 అర్ధరాత్రితో అధికారికంగా ముగిసింది. దీంతో ఇకపై ఈ తేదీ తర్వాత మరణించిన రైతులకు రైతు బీమా కింద క్లెయిమ్ నమోదు చేసే అవకాశం ఉండదని తెలిపింది. అయితే, గడువు ముగిసేలోపు అంటే ఆగస్టు 13న లేదా అంతకంటే ముందు మరణించిన అర్హులైన రైతుల క్లెయిమ్‌లను మాత్రం అధికారులు నమోదు చేసి పరిష్కరించనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రైతు బీమా క్లెయిమ్‌ల నమోదులో నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. బీమా సాయం కోసం దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత రైతు మరణించిన తేదీని అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే రైతు మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ప్రభుత్వ రికార్డులను కూడా పరిశీలించి, మరణించిన ఖచ్చితమైన తేదీని క్షేత్రస్థాయిలో అధికారులు నిర్ధారించుకోవాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఈ వివరాలు ధ్రువీకరించిన తర్వాతే బీమా ఆర్థిక సాయం కోసం సిస్టమ్‌లో క్లెయిమ్ వివరాలను నమోదు చేయాలని పేర్కొంది.
మరోవైపు.. ఆగస్టు 13 తర్వాత రైతు మరణించినట్లయితే, అలాంటి కేసులను రైతు బీమా కింద స్వీకరించవద్దని జిల్లా అధికారులకు స్పష్టమైన సూచనలు అందాయి. అంటే పథకం గడువు ముగిసిన తర్వాత సంభవించిన మరణాలకు ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో బీమా క్లెయిమ్ వర్తించదు. ప్రస్తుతం రైతు బీమా పరిధిలో ఉన్న సమయంలో మరణించిన అర్హులైన రైతులకు సంబంధించిన క్లెయిమ్‌లపై అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు.
దరఖాస్తుల్లో ఉన్న వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ రికార్డులను సరిపోల్చి అర్హతను నిర్ధారించిన తర్వాతే తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు. కాబట్టి రైతు బీమా కింద క్లెయిమ్ చేసుకునే కుటుంబాలకు ఆగస్టు 13 అర్ధరాత్రి వరకు పథకం అమల్లో ఉన్న సమయంలో జరిగిన మరణాలకు మాత్రమే ప్రస్తుత నిబంధనల ప్రకారం క్లెయిమ్ నమోదు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగిన మరణాలకు మాత్రం రైతు బీమా వర్తించదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.


