పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. ఎవరైతే ఆమెకు నమ్మకస్తులుగా ఉన్నారో వారిమీద కేసులు ఫైల్ అవ్వడం, జైలు వెళ్లడం జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడంతో గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నేరచరిత్ర కలిగిన వారిపై చార్జ్‌షీట్ తెరిచి లోపల వేస్తున్నారు. అయితే, గత ప్రభుత్వంలో మాజీ మంత్రి,డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన టీఎంసీ నేత ఆశిశ్ బెనర్జీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
ఈ ఘటన బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లా రాంపూర్ హాట్‌లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీఎంసీ సీనియర్ నేత ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాంపూర్‌హాట్‌లోని తన నివాసానికి సమీపంలోని టీఎంసీ పార్టీ ఆఫీసులో ఆయన ఉరేసుకుని కనిపించినట్టు సమాచారం. పార్టీ నేతల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
టీఎంసీ పార్టీ ఆఫీసులో ఓ సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.ఆత్మహత్యకు పాల్పడిన ఆశిష్ బెనర్జీ మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. దీంతో ఆమెను పోలీసులు విచారించే అవకాశం లేకపోలేదని సమాచారం. అధికారం కోల్పోయాక దీదీని వరుస వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీఎంసీ పార్లమెంటరీ పార్టీ రెండు ముక్కలు అయ్యింది. తాజాగా ఆశిష్ బెనర్జీ మరణంతో ఆ పార్టీ మరింత చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. మృతుడు ఆశిష్.. మమతా మంత్రివర్గంలో విద్యా, వ్యవసాయ శాఖల మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.కాగా, ఆయన మృతి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.


