కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య కయ్యాలు, వివాదాలు సర్దుమనగడం లేదు. పదవులు రాని వారంతా సొంత పార్టీ, ఏకంగా సీఎం రేవంత్, మంత్రులను కార్నర్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరైతే పేర్లు మెన్షన్ చేయకుండా పరోక్షంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఏకంగా పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
దీంతో ఏం చేయాలో తెలిక అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ మల్లన్న, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నడుమ వివాదం నెలకొంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఓ కులాన్ని టార్గెట్ చేస్తూ మల్లన్న మాట్లాడటంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మల్లన్న ఒక బీసీ ద్రోహి అంటూ మండిపడ్డారు.‘బీసీ ద్రోహి మల్లన్న, నీ నడ్డి విరుగుడు ఖాయం. మొగోనివైతే నీ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేయ్. నీకు డిపాజిట్ వస్తే నేను ఆలేరులో పోటీ చేయను’ అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సవాల్ విసిరారు. నల్గొండ, మునుగోడులో దమ్ముంటే మీటింగ్ పెట్టాలని, కాంగ్రెస్ బిక్ష, బీ ఫామ్‌తో గెలిచి విర్రవీగుతున్నావని మండిపడ్డారు.
https://x.com/TeluguScribe/status/2088635946048839727?s=20
‘ఎదుటి కులాన్ని దూషించే సంస్కారం లేని వ్యక్తివి నువ్వు. పేరు, ఊరు, పార్టీ మార్చుకున్నోడు మల్లన్న. బీ ఫామ్ ఇచ్చి గెలిపించిన పార్టీపైనే నిందలేస్తున్నాడు. బీసీ ముసుగులో బీసీలను అణగదొక్కుతున్నాడు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీ బీసీ ముసుగు బయటపడతది.
బీసీ బిడ్డలపై నీ బలుపు, అహంకారపు మాటలు ఏంది?’ అంటూ ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు.ఇదిలాఉండగా, మల్లన్న బీసీ నినాదం ఎత్తుకుని వారందరినీ ఐక్యం చేయాలని సొంత ఏజెండాతో కాంగ్రెస్ పార్టీ మీదే గత కొంతకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రెడ్డి కులస్తులను ఆయన టార్గెట్ చేసినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.


