International

జర్మనీతో రూ.70,000 కోట్ల ఒప్పందం.. భారత నౌకాదళంలోకి 6 అత్యాధునిక జలాంతర్గాములు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

భారత నౌకాదళాన్ని మరింత సమర్థవంతంగా, బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక రక్షణ ఒప్పందానికి సిద్ధమవుతోంది. ప్రాజెక్ట్-75(ఐ) కింద జర్మనీ సహకారంతో ఆరు అత్యాధునిక సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించనుంది. ఈ మేరకు రూ.70,000 కోట్ల భారీ ప్రతిపాదన త్వరలోనే కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ (CCS) ముందుకు రానుంది.

భారత నౌకాదళాన్ని మరింత సమర్థవంతంగా, బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక రక్షణ ఒప్పందానికి సిద్ధమవుతోంది. ప్రాజెక్ట్-75(ఐ) కింద జర్మనీ సహకారంతో ఆరు అత్యాధునిక సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించనుంది. ఈ మేరకు రూ.70,000 కోట్ల భారీ ప్రతిపాదన త్వరలోనే కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ (CCS) ముందుకు రానుంది. మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా ఈ జలాంతర్గాములను భారత్‌లోనే నిర్మించేలా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇక ఆమోద ముద్ర వేయడానికి సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారతదేశానికి చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ (MDL), జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ థైసెన్‌క్రుప్ మెరైన్ సిస్టమ్స్ (TKMS) సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా దేశీయంగా జలాంతర్గాముల నిర్మాణ సాంకేతిక సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించడంతో పాటు హిందూ మహాసముద్రంలో భారత నావికాదళ వ్యూహాత్మక పట్టును మరింత బలపరచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.

ఈ జలాంతర్గాములలో అమర్చే 'ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్' (AIP) వ్యవస్థ అత్యంత కీలకమైన అంశంగా నిలవనుంది. జర్మనీ నుంచి అందుబాటులోకి రానున్న ఈ అధునాతన సాంకేతికత వల్ల జలాంతర్గాములు బ్యాటరీలను ఛార్జ్ చేసుకునేందుకు తరచుగా నీటి ఉపరితలానికి రావాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల శత్రు రడార్లకు దొరక్కుండా ఎక్కువ రోజులు నీటి అడుగున నిశ్శబ్దంగా సంచరిస్తూ తమ కార్యకలాపాలను నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది.

ప్రాజెక్ట్-75(ఐ)పై గత కొంతకాలంగా వివిధ చర్చలు కొనసాగుతున్నప్పటికీ, తాజాగా కేంద్ర కేబినెట్ భద్రతా కమిటీ ఆమోదం లభిస్తే నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య, రక్షణ సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లే ఈ డీల్ పూర్తయితే భారత సముద్ర తీర భద్రత మరింత పటిష్టం కావడమే కాకుండా, సాంకేతిక బదిలీ ద్వారా దేశీయ రక్షణ ఉత్పత్తి రంగానికి గొప్ప ఊపు లభించనుంది.

 

#India Germany Submarine Deal#Project 75 I#Mazagon Dock Shipbuilders#Thyssenkrupp Marine Systems#Indian Navy#Defence Ministry#AIP Technology#Cabinet Committee on Security#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి