హీరోలు అంటే కేవలం తెరపై కనిపించే తారలు కాదు.. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు. వాళ్లు మాట్లాడే మాట, వేసే దుస్తులు, చేసే ప్రకటన.. ఇలా వారి ప్రతి అంశాన్ని అభిమానులు గమనిస్తారు. ఫాలో అవుతారు. అలాంటి స్టార్ హీరోలు ప్రజల ఆరోగ్యానికి హానికరమయ్యే ఉత్పత్తులను ప్రమోట్ చేయడం బాధాకరమైన అంశం. ఇప్పటికే చాలా మంది నటీ నటులు యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. అయితే కొందరు హీరోలు మాత్రం ఎటువంటి ప్రకటనల్లో నటించకుండా వాళ్ళ పరువు కాపాడుకుంటూ ఉన్నారు.
ఇక తాజాగా బాలీవుడ్‌కు చెందిన ముగ్గురు అగ్ర హీరోలకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లు నటించిన విమల్ ఇలాచ్చి ప్రకటనపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గుట్కా, పొగాకు, నికోటిన్ కలిగిన పాన్ మసాలా విక్రయాలు, తయారీపై నిషేధం అమలులో ఉండగా.. విమల్ ఇలాచ్చి పేరుతో అదే బ్రాండ్‌ను పరోక్షంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారని అధికారులు ప్రశ్నించారు.
మరోవైపు ప్రకటనలోని బ్రాండ్ పేరు, డైలాగ్స్, ప్రచార విధానం.. ఇవన్నీ పాన్ మసాలా బ్రాండ్‌తో నేరుగా సంబంధం కలిగి ఉన్నాయని ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో ముగ్గురు హీరోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006లోని సెక్షన్ 24, 53 కింద ఈ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే.. ఒక్కొక్కరికి సుమారుగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇక హీరోలు అంటే కేవలం సినిమాల్లో వినోదాన్ని అందించేవాళ్లు మాత్రమే కాదు. కోట్లాది మంది అభిమానించే సెలబ్రిటీలు. ముఖ్యంగా యువత, పిల్లలు తమ అభిమాన హీరోలను అనుకరించే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అలాంటి సమయంలో డబ్బు కోసం ఏ ప్రకటనలోనైనా నటించడం ఎంతవరకు సమంజసం? ఒకవైపు పొగాకు, గుట్కా, పాన్ మసాలా వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ప్రభుత్వాలు, వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తుంటే.. మరోవైపు ప్రజల అభిమానాన్ని సంపాదించిన సెలబ్రిటీలు ఇలాంటి ఉత్పత్తులను పరోక్షంగా ప్రమోట్ చేయడం సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో ఇదే తరహా వివాదంలో అక్షయ్ కుమార్ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. విమర్శల అనంతరం ఆయన ఆ బ్రాండ్ ప్రకటనల ఒప్పందం నుంచి తప్పుకుని, బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు ఆయన స్థానంలో టైగర్ ష్రాఫ్ ఆ ప్రకటనలో కనిపించడం మరోసారి చర్చకు కారణమైంది.
ఒక స్టార్ తన ఇమేజ్‌తో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు.. కానీ అదే ఇమేజ్‌ను ఉపయోగించి సమాజానికి ఏ సందేశం ఇస్తున్నాడన్నది కూడా అంతే ముఖ్యం. అందుకే సెలబ్రిటీలు ఇకపై యాడ్‌కు వచ్చే పారితోషికం మాత్రమే కాకుండా.. ఆ ఉత్పత్తి వల్ల సమాజంపై పడే ప్రభావాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


