హైదరాబాద్ మహానగరంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) చట్టం పేరిట ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జారీ చేసిన 22A నిషేధిత భూముల ఉత్తర్వులపై భూ బాధితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎలాంటి ముందస్తు విచక్షణ లేకుండా గుట్టలబేగంపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ల మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చడంపై స్థానిక ప్రజలు, కాలనీవాసులు మండిపడుతున్నారు. కాకతీయ హిల్స్, సైబర్ హిల్స్, ప్రిస్టన్ విల్లాస్ వంటి ప్రధాన కాలనీల నివాసితులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందడంతో కాకతీయ హిల్స్ పార్క్‌లో మార్నింగ్ వాక్‌కు వచ్చిన బాధితులంతా ప్రభుత్వ తీరుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
గుట్టలబేగంపేటలోని 80శాతానికి పైగా ప్లాట్ల యజమానులు దశాబ్దాల క్రితమే కోర్టు తీర్పులకు అనుగుణంగా యూఎల్‌సీ రుసుములు చెల్లించి, జీహెచ్‌ఎంసీ (GHMC) నుంచి అన్ని అనుమతులు పొంది గత 10-15 ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్న పౌరుల భూములను సైతం ఏకపక్షంగా 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేవలం గుట్టలబేగంపేట మాత్రమే కాకుండా నగరంలోని అనేక రెవెన్యూ గ్రామాలు, కాలనీలలోని ఇళ్లను కూడా ఈ నిషేధ పరిధిలోకి తీసుకురావడంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలువురు ఈ విషయమై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమ ఆస్తులను 22Aలో ఎందుకు చేర్చినట్లు? ఏ కమిషన్లు వసూలు చేయడానికి ఈ దారుణానికి పాల్పడుతున్నారంటూ నిలదీస్తున్నారు. ఒక వేళ యూఎల్‌సీ తీసుకోని ప్లాట్లు, భూములు ఏవైనా ఉంటే అంతవరకే స్పష్టంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందరినీ అందులో చేర్చడం అంటే ఈ ప్రభుత్వానికి బుర్ర, బుద్ధి ఉన్నాయా? ఈ పని చేసింది ఎవరు? సలహా ఇచ్చింది ఎవరు? ఇది పెద్ద కుంభకోణంగా మారకముందే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటారా? లేక రెవెన్యూ మంత్రి ఇష్టారాజ్యానికి వదిలేస్తారా? అంటూ నిలదీస్తున్నారు.
ఈ వ్యవహారంపై మంత్రివర్గంలోనూ తీవ్ర చర్చ నడిచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. "ఇలా నిర్ణయం తీసుకుంటే ఇది పెద్ద సమస్యగా మారుతుంది" అని ఒక మంత్రి ప్రశ్నించగా, "అదంతా మేము చూసుకుంటాం" అని సంబంధిత శాఖ మంత్రి సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఏమాత్రం విచక్షణ లేకుండా సలహాలిచ్చి, ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ సమస్య మరింత తీవ్రమై పెద్ద ఎత్తున నిరసనలకు దార తీయకముందే ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని, రెవెన్యూ శాఖ ఇష్టారాజ్యంగా జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భూబాధితులారా.. కదలిరండి..
ప్రభుత్వం సృష్టించిన ఈ 'ధరణి - భూ భారతి', 22A సమస్యలపై నిలదీసేందుకు, బాధితులందరినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు 'తెలంగాణ సమాఖ్య' సిద్ధమైంది. ఈ క్రమంలో "భూ బాధితులారా కదిలి రండి" అంటూ పిలుపునిచ్చింది. ఈ భూ సమస్యలపై సమగ్రంగా చర్చించి, తగిన కార్యాచరణను రూపొందించేందుకు ఆగస్టు 18, 2026 (మంగళవారం) రోజున హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ 22A నిషేధిత భూముల నిర్ణయాలు, ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులంతా ఈ సమావేశానికి తరలివచ్చి చర్చల్లో పాల్గొనాలని తెలంగాణ సమాఖ్య ప్రతినిధులు కోరారు. తమ భూ సమస్యలకు సంబంధించిన వివరాలను, సందేహాలను 9849436246 లేదా 9618312656 అనే వాట్సాప్ నంబర్లకు పంపి నేరుగా నిలదీయాలని పిలుపునిచ్చారు. అధికారులు, పాలకులు చేసిన పొరపాట్లకు సామాన్య నివాసితులు బలికాకుండా ఈ రౌండ్ టేబుల్ వేదికగా పోరాట కార్యాచరణను ప్రకటించనున్నారు.


