నాగపంచమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. ప్రకృతిలోని సకల జీవులతో మానవ సంబంధాన్ని పునరుద్ధరించే ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక పర్వదినం. కుండలినీ శక్తికి, కాలచక్రానికి, అంతర్గత పరివర్తనకు నాగులు ప్రత్యక్ష ప్రతీకలుగా శాస్త్రాలు చెబుతాయి.
ఇక నాగపంచమి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని పూజను ప్రారంభించాలి. ముందుగా ఇంటి ఈశాన్య మూలలో పసుపు కుంకుమలతో అష్టదళ పద్మ ముగ్గును వేసి, దానిపై పీఠాన్ని అమర్చి, వెండి, రాగి లేదా మట్టితో చేసిన నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్టించాలని పండితులు చెబుతున్నారు.
ఒకవేళ విగ్రహం అందుబాటులో లేకపోతే, నాగదేవతల చిత్రం వద్ద గానీ లేదా నేరుగా పుట్ట వద్ద గానీ ఈ పూజను నిర్వహించవచ్చని అంటున్నారు.. అనంతరం "ఓం నమఃశివాయ" లేదా "ఓం నాగదేవతాయై నమః" అనే మంత్రాలను పఠిస్తూ నాగదేవతకు పాలు, శుద్ధ జలం, తేనెతో భక్తిశ్రద్ధలతో అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తయిన తర్వాత పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి, సువాసనగల తెల్లటి పుష్పాలు, గరికను సమర్పించాలి.
అనంతరం నాగదేవతకు అత్యంత ప్రీతిపాత్రమైన పచ్చి పాలు, చలిమిడి, వడపప్పు, బెల్లం, నువ్వుల పిండివంటలను నైవేద్యంగా ఉంచాలి. ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి, గుగ్గిలం లేదా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల వాతావరణంలో సానుకూల శక్తి ప్రసరిస్తుందని పండితులు వివరిస్తున్నారు.. ఇక పూజా సమయంలో "అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్.. అనే నవనాగ స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ, చివరగా కర్పూర హారతిని సమర్పించి నాగదేవత ఆశీస్సులు అందుకోవాలి..
మరోవైపు ఈ పూజ్యలోని ఆధ్యాత్మిక అంతరార్థం పరిశీలిస్తే, మానవ శరీరంలోని మూలాధార చక్రంలో నిద్రాణమై ఉండే కుండలినీ శక్తి పాము సంకేతం. ఈ ఆరాధన మనలోని ఆత్మశక్తిని జాగృతం చేయడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు, రాహు-కేతు ప్రభావాల నుండి ఉపశమనం పొంది మానసిక భయాలను తొలగించుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషించే సరీసృపాలను గౌరవించడం ద్వారా ప్రకృతితో మమేకం కావాలనే గొప్ప సందేశాన్ని ఈ నాగపంచమి పర్వదినం మనకు అందిస్తోందని పురాణాలు చెబుతున్నాయి..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


