* అఘోరా పూజల మంటలు..!
* సీఎం రేవంత్, హరీశ్ మధ్య మాటల యుద్ధం
* సాక్ష్యాలు చూపాల్సిందేనని హరీశ్ డిమాండ్
* లేదంటే కోర్టుకి లాగుతా, పరువు నష్టం దావావేస్తానని వార్నింగ్
Harish Rao: తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అఘోరా పూజలు, క్షుద్ర పూజలు, చేతబడులు అంటూ అధికార పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు అఘోరా పూజలు చేశారంటూ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపించడం సంచలనంగా మారింది. కొన్ని రోజులుగా ఈ అంశం చుట్టూ రాజకీయ వివాదం నడుస్తోంది.
శివమొగ్గ గుడిలో చేసిన పూజల వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదు?
రాష్ట్రంలో వానలు కురవకుండా, కరువు రావాలని బీఆర్ఎస్ నేతలు అఘోరా పూజలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. తాజాగా సంగారెడ్డి సభలో మరోసారి అఘోరా పూజల గురించి రేవంత్ ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కరవు రావాలని బీఆర్ఎస్ నాయకులు అఘోరా పూజలు చేస్తున్నారని ఆయన మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. తనపై చేతబడి చేసినా ఏమీ కాదన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలపై అఘోరా పూజలు చేయడం సరికాదన్నారు. ఏ పని చేసినా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెడతారు కదా.. మరి శివమొగ్గ గుడిలో చేసిన పూజల వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదు? అని హరీశ్ రావు టార్గెట్ గా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అధికారం కోసం ఇంత దుర్మార్గమా?
''ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారు. పన్నాగాలు పన్నారు. ఒకాయన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లాడు. ఏమన్నా మంచి కోరతాడేమో అనుకున్నా. మంచి కోరలేదు. అఘోరా పూజలు చేశాడు. ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా? మనిషన్నోడు, పదేళ్లు మంత్రిగా పని చేసినోడు, అన్నం తినే వాడు ఎవడైనా.. ఈ రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు చనిపోవాలని, సంక్షోభం రావాలని, ప్రభుత్వం కూలిపోవాలని, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి, శవాల మీద అధికారం కావాలని అఘోర పూజలు, అర్థరాత్రి పూజలు చేస్తారా? ఇంతటి దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా?
పూజల వీడియోలు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు?
నా మీదనో, మా మహేశ్ గౌడ్ మీదనో చేతబడి చేశారంటే మేము ఎలాగైనా ఎదుర్కొంటాము. కానీ ప్రజల మీద చేతబడులు చేయడం ఏంటి? ఇలాంటి వారికి ప్రజా జీవితంలో ఉండేందుకు అర్హత ఉందా? మీరు ఎక్కడికి పోయినా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెడతారు కదా? మరి మీరు శివమొగ్గ గుడిలో పూజలు చేస్తే ఆ వీడియో సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు? అసలు పోయినట్లు కూడా ఎందుకు చెప్పడం లేదు?
ఆ గుళ్లలో చేసిన పూజలు ఏంటి?
కర్నాటక, తమిళనాడులో గుళ్లకు పోయినట్లు మీ సోషల్ మీడియాలో కానీ మీ దినచర్యలో కానీ ఎక్కడా కూడా ఎందుకు ప్రకటించలేదు? ఎందుకు రహస్యంగా ఉంచారు? గుడికి పోతే దండం పెట్టుకుంటాం. గుడి బయటకు వచ్చి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం. మేము తిరుపతి పోయినా శ్రీశైలం పోయినా యాదగిరి గుట్టకు పోయినా మీడియా అందరినీ పిలిచి దర్శనం చేసుకుని పది కాలాల పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేస్తాం. మరి నువ్వు శివమొగ్గ గుడికి పోయింది ఎందుకో చెప్పలేదు? పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు? తమిళనాడులో ఏయే గుళ్లకు పోయావు? ఆ గుళ్లలో జరిగే పూజలు ఏంటి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వారి వివరాలు బయటపెట్టు'' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అబద్దాలతో ప్రజలను మోసం చేయలేరు
సీఎం రేవంత్ రెడ్డి చేసిన అఘోర పూజల ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. ''అబద్దాన్ని పదే పదే చెప్పి ప్రజలను నమ్మించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఒకసారి అంటే మోసం చేయొచ్చు. కానీ ప్రతిసారి మీ అబద్దాలతో ప్రజలను మోసం చేయలేరు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్లు.
సాక్ష్యాలు చూపిస్తారో.. శిక్షకు సిద్ధపడతారో మీ ఇష్టం..
ఇవాళ మీ దోపిడో గురించో, మీ మైనింగ్ స్కామ్ గురించో, మీ 22ఏ గురించో, రుణమాఫీ చేయలేదనో, రైతులు ఎరువుల గురించో, రైతు బంధు గురించో, ప్రతి రోజును నిన్ను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. మోకాలికి, బోడిగుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ప్రజల గొంతుగా.. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ తరపున నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. వదిలేది లేదు. పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. కచ్చితంగా కోర్టుకి ఈడుస్తా. పరువు నష్టం దావా వేస్తా. మీరు ఆధారాలు చూపాల్సిందే. లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే'' అని హరీశ్ రావు హెచ్చరించారు.
వ్యక్తిగత విమర్శలకు భయపడను
''మైనింగ్ స్కామ్, 22ఏ, రుణమాఫీ, ఎరువులు, స్కాలర్‌షిప్స్ గురించి తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇలాంటి చిల్లర మాటలకు నేను భయపడను. ప్రజలు, రైతులు, విద్యార్థుల తరఫున బీఆర్ఎస్ పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటా. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కచ్చితంగా పరువు నష్టం దావా వేస్తా. “సాక్ష్యాలు చూపిస్తారో.. శిక్షకు సిద్ధపడతారో వారి ఇష్టం” అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.


