పేదల కడుపు నింపాల్సిన సన్నబియ్యం.. అక్రమ వ్యాపారుల జేబులు నింపుతుంది. పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం అక్రమ రవాణాకు గురవుతున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
అయితే ప్రస్తుత ఆగస్టు నెలలో ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని పంపిణీ చేయడంతో.. అక్రమ వ్యాపారులు రంగంలోకి దిగినట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైరా, తల్లాడ, కొణిజర్ల మండలాల్లోని పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి.. సరిహద్దు ప్రాంతాల మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం.
ముఖ్యంగా వైరా మండలంలోని గన్నవరం గ్రామం కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం నిల్వలు, రవాణా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బొలెరోలు, ఇతర వాహనాల ద్వారా బియ్యాన్ని సేకరించి.. అక్కడ నిల్వ చేసి, అనంతరం లారీల్లో తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అదే విధంగా కొణిజర్ల మండలంలోని పెద్దమునగాల కేంద్రంగా కూడా రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొణిజర్ల, చింతకాని మండలాల నుంచి బియ్యాన్ని సేకరించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఇంత బహిరంగంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారుల నిఘా ఎక్కడ లేదని, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రధాన రహదారులపై వాహనాలు తిరుగుతున్నా తనిఖీలు ఎందుకు జరగడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన గన్నవరం క్రాస్‌రోడ్డులో గతంలో ఉన్న చెక్‌పోస్ట్ తొలగించడంతో అక్రమ రవాణాకు మరింత అవకాశం ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని.. గన్నవరం, పెద్దమునగాల ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి.. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.


