Anirudh Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీని ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలపై రచ్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై సీరియస్ అయ్యారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలుస్తుండటం గమనార్హం.
పార్టీ బాగుండాలన్నదే రాజగోపాల్ రెడ్డి తాపత్రయం..
తాజాగా ఈ వ్యవహారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన మద్దతుగా నిలిచారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎవరికీ వ్యతిరేకంగా మాటాడలేదన్నారు. అవినీతి పైనే మాట్లాడారని చెప్పారు. పార్టీ బాగుండాలన్నదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాపత్రయం అని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి ఒక అగ్నిపర్వతం లాంటి వారని, ఆయనకు కోపం వస్తే అగ్నిపర్వతంలా బరస్ట్ అవుతారని అన్నారు.
మంత్రి పదవి కావాలని ఎన్నడూ అడగలేదు..
''రాజగోపాల్ రెడ్డి అవినీతిపై మాట్లాడారు. పార్టీ బాగుండాలని మాట్లాడారు. ఆయన తప్పుగా మాట్లాడారని నాకు ఎక్కడా అనిపించలేదు. రాజగోపాల్ రెడ్డి ఒక అగ్నిపర్వతం. ఆయనకు కోపం వచ్చిందంటే అగ్నిపర్వతం బరస్ట్ అయినట్లు బరస్ట్ అవుతారు. మంత్రి పదవి కోసం ఆయన ఎన్నడూ అడగలేదు, కొట్లాడలేదు. ఆయన ప్రజల సమస్యలపై అడుగుతున్నారు. అందులో తప్పేమీ లేదు. ఇష్యూస్ ను పరిష్కరిస్తే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా'' అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.












