అరుణాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పాటు ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తు ఇప్పటికే నలుగురి ప్రాణాలను బలితీసుకోగా.. మరోవైపు ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఎగువ సుబన్‌సిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కొండచరియల కింద ఎవరైనా చిక్కుకుపోయారా అనే అనుమానంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు..
ఇక దిబాంగ్ వ్యాలీ జిల్లాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆకస్మిక వరదల ఉద్ధృతికి ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో వారి ఆచూకీ కోసం సైన్యం, స్థానిక యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. అలాగే ఎప్పుడు కొండచరియలు విరిగిపడతాయో తెలియని పరిస్థితి ఈ ప్రాంతాల్లో నెలకొంది.
ఇక నదులు, వాగులు ఉప్పొంగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేస్తూ.. గల్లంతైన ఆర్మీ సిబ్బంది కోసం గాలింపు ముమ్మరం చేశారు.
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ను వరుసగా వర్షాలు వణికిస్తున్నాయి. జూన్ చివరి వారంలో వచ్చిన వరదలతో కీయి పన్యోర్, లోయర్ సియాంగ్ జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. ఇక జూలై మూడో వారంలో కురుంగ్ నది ఉప్పొంగడంతో ప్రధాన వంతెనలు కొట్టుకుపోయి పలు ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి..












