ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లలో బోగస్, నకిలీ కనెక్షన్లను గుర్తించి అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ప్రభుత్వం ఆగస్టు 16 లోపు ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే దీనికోసం మీరు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లోని ఆధార్ ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఇంటి వద్ద నుంచే చాలా సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
మీది హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ అయితే, ముందుగా మీ మొబైల్‌లోని ప్లే స్టోర్ నుంచి HP Pay మరియు Aadhaar FaceRD యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి మీ గ్యాస్ అకౌంట్‌కు లింకైన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ వెరిఫై చేసుకుని లాగిన్ అవ్వాలి. అనంతరం హోమ్ పేజీలోని మై హెచ్‌పీ సెక్షన్‌కి వెళ్లి ఎల్‌పీజీ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఈ-కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి క్యాప్చర్ ఫేస్ ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
ఒకవేళ మీది భారత్ గ్యాస్ కనెక్షన్ అయితే, ప్లే స్టోర్ నుంచి Hello BPCL మరియు Aadhaar FaceRD యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత యాప్ హోమ్ పేజీలోనే ఈ-కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మరోసారి ఓటీపీ వెరిఫై చేసుకున్నాక, స్క్రీన్‌పై వచ్చే సూచనలు పాటిస్తూ మీ ముఖాన్ని స్కాన్ చేస్తే కేవైసీ పూర్తవుతుంది.
ఇక మీరు ఇండేన్ గ్యాస్ వినియోగదారులైతే, ప్లే స్టోర్ నుంచి IndianOil One మరియు Aadhaar FaceRD యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక మొదటిసారి ఈ యాప్ వాడుతుంటే సైన్ అప్ పై క్లిక్ చేసి, మీ గ్యాస్ క్యాష్ మెమోపై ఉండే 16 అంకెల ఎల్‌పీజీ ఐడీని లింక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో మై ప్రొఫైల్ పై క్లిక్ చేస్తే ఆధార్ లింక్డ్ అండ్ ఈ-కేవైసీ స్టాటస్ కనిపిస్తుంది.
అక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంటే మీ కేవైసీ ఇప్పటికే పూర్తయినట్లు అర్థం. ఒకవేళ లేకపోతే, అక్కడే ఉన్న రీ-అథెంటికేట్ బటన్ నొక్కి ముఖాన్ని స్కాన్ చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేసే ముందు మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయి ఉంటే, మొదటగా ఎమ్-ఆధార్ యాప్ ద్వారా దాన్ని అన్‌లాక్ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. కాబట్టి చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే మీ మొబైల్‌లోనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోండి..


