తెలంగాణ

తెలంగాణలో రూ. 1,100 కోట్ల PF మిస్టరీ.. అసలు డబ్బెక్కడ?

రచన: Kashi••6 నిమిషాల పఠనం

ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్.. డబ్బు ఎక్కడికి వెళ్లింది అనేది గుర్తించడం. ఏ ఏజెన్సీ ఎంత మొత్తాన్ని తీసుకుంది? ఎంత PF జమ చేసింది? ఎంత మొత్తం బకాయిగా ఉంది? ఏ ఉద్యోగుల ఖాతాల్లో PF జమ కాలేదు? ఇంకా.. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన అధికారుల పాత్ర ఏంటి? అనే అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది.

PFలో భారీ గోల్‌మాల్‌ అనుమానాలు..

రూ. 1,100 కోట్లపై డౌట్స్..

ఆ డ‌బ్బుల‌న్నీ ఎవరి ఖాతాల్లోకి..?

తెలంగాణలో అసలేం జరిగింది..?

తెలంగాణ ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్‌ వ్యవస్థలో వెలుగులోకి వచ్చిన PF అవకతవకలు ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తున్నాయి. రూ. 1,100 కోట్లకు పైగా PF మొత్తంలో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయన్న వార్తలతో.. అసలు ఈ వ్యవహారం ఎలా జరిగింది? ఇంత పెద్ద మొత్తం ఎలా పేరుకుపోయింది? బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 1.6 లక్షల మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలను పరిశీలించే క్రమంలో ఈ వ్యవహారం బయటపడింది. ఆడిట్‌తో పాటు ఆధార్‌ సీడింగ్‌ ద్వారా ఉద్యోగుల వివరాలను పరిశీలించగా.. 60 శాతానికి పైగా ఉద్యోగులకు PF ఖాతాలు లేకపోవడం లేదా PF చెల్లింపుల్లో క్రమబద్ధత లేకపోవడం గుర్తించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. ప్రభుత్వ శాఖలు అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు కేవలం ఉద్యోగుల జీతాల కోసమే డబ్బులు చెల్లించవు. ఉద్యోగి వాటా, యజమాని వాటా PF, ESI, ఏజెన్సీ కమిషన్‌, GST తదితర చెల్లింపులు కూడా ఆ మొత్తంలో ఉంటాయి. ఉద్యోగి జీతం నుంచి PF మొత్తాన్ని ఏజెన్సీ మినహాయించడంతో పాటు.. ప్రభుత్వం చెల్లించిన యజమాని వాటాను కూడా సంబంధిత సంస్థలకు జమ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలదే.

కానీ ఆడిట్‌లో కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన PF మొత్తంతో పాటు.. ప్రభుత్వం ఏజెన్సీలకు విడుదల చేసిన యజమాని వాటా కూడా EPFOకి సక్రమంగా జమ కాలేదన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొన్నేళ్లుగా జరిగిన చెల్లింపులు, ఆడిట్‌ రికార్డులను పరిశీలించిన తర్వాతే రూ.1,100 కోట్లకు పైగా మొత్తంపై అనుమానాలు వ్యక్తమైనట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఎవ‌రా ఘోస్ట్ ఉద్యోగులు..?

ఇక ఈ వ్యవహారంలో మరో కీలక అంశం ‘ఘోస్ట్‌ ఉద్యోగుల’ అనుమానాలు. ఆధార్‌ ఆధారిత వెరిఫికేషన్‌లో ఏజెన్సీలు చూపించిన ఉద్యోగుల సంఖ్యకు.. వాస్తవంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారి సంఖ్యకు మధ్య కొన్ని చోట్ల తేడాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో అసలు ఉద్యోగులు ఎవరు? జాబితాల్లో లేని వారు ఎలా చేర్చబడ్డారు? వారి పేర్లపై జీతాలు, PF చెల్లింపులు జరిగాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్.. డబ్బు ఎక్కడికి వెళ్లింది అనేది గుర్తించడం. ఏ ఏజెన్సీ ఎంత మొత్తాన్ని తీసుకుంది? ఎంత PF జమ చేసింది? ఎంత మొత్తం బకాయిగా ఉంది? ఏ ఉద్యోగుల ఖాతాల్లో PF జమ కాలేదు? ఇంకా.. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన అధికారుల పాత్ర ఏంటి? అనే అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది.

మరోవైపు కొన్ని అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు పరిశీలన తీవ్రం కావడంతో కార్యకలాపాలు నిలిపివేసినట్లు కూడా తెలుస్తోంది. దీంతో డబ్బు రికవరీ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం సంబంధిత ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు, PF మొత్తాల రికవరీకి చర్యలు తీసుకునే దిశగా వెళ్తున్నట్లు సమాచారం.

అయితే ఈ వ్యవహారం కేవలం ఏజెన్సీల వరకే పరిమితం కాకూడదన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏజెన్సీలు PF చెల్లింపులు చేస్తున్నాయా లేదా అన్నది పర్యవేక్షించాల్సిన వ్యవస్థ కూడా ఉంది. ప్రతి నెలా PF చలాన్లు, సంబంధిత రికార్డులు పరిశీలించి ఉంటే ఇంత పెద్ద మొత్తంలో అనుమానాలు ఎందుకు తలెత్తాయన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

అందుకే తెలంగాణలో బయటపడిన ఈ వ్యవహారం.. కేవలం రూ. 1,100 కోట్ల లెక్క కాదు. ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్‌ వ్యవస్థలో ఉద్యోగుల డేటా ఎలా నిర్వహిస్తున్నారు? వారి జీతాలు, PF, ESI చెల్లింపులను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? కాంట్రాక్టు ఏజెన్సీలపై ప్రభుత్వ నియంత్రణ ఎంతవరకు ఉంది? అన్న ప్రశ్నలను కూడా ముందుకు తెచ్చింది.

#Telangana PF Scam#Telangana PF Irregularities#Telangana Outsourcing Employees#PF Irregularities#₹1100 Crore PF#Telangana News#Telangana Politics#Outsourcing Employees#EPFO#PF Scam India#Ghost Employees#Telangana Government#Audit Report#Hyderabad News#Telangana Latest News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి