రాష్ట్రంలో కొందరు పోలీస్ అధికారుల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ కీలక హెచ్చరిక చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భూ వివాదాల వంటి సివిల్ తగాదాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు.
డీజీపీ కార్యాలయం నుంచి యూనిట్ అధికారులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌హెచ్‌వోలతో నిర్వహించిన ఆన్‌లైన్ సమీక్షలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. యూనిట్ అధికారులు తరచూ పోలీస్ స్టేషన్లను సందర్శించి నేర నియంత్రణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలని తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆదేశించారు. త్వరలో 112 సేవల్ని డ్రోన్‌తో అనుసంధానించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్యం, లాటీయాప్ వంటి డిజిటల్ వ్యవస్థలను సమర్థంగా వినియోగించాలని, ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన ఆధారాలను ఈ-సాక్ష్యం పోర్టల్‌లో సకాలంలో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
ఈ-సాక్ష్యం వినియోగంలో భూపాలపల్లి, సిద్దిపేట, నల్గొండ జిల్లాలు మెరుగైన పురోగతి సాధించాయని, ఈ-సమన్ల అమలులో కామారెడ్డి, వనపర్తి జిల్లాలు ఉత్తమ పనితీరు కనబరిచాయని ప్రశంసించారు. అలాగే విధుల్లో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులకు రివార్డులను ప్రకటించారు.












