కేంద్రంలోని మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది. గోల్డ్ మానిటైజేషన్‌ను పునరుద్ధరించాలని చూస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. రాబోయే రెండు వారాల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే చాన్స్ ఉంది. గోల్డ్ మానిటైజేషన్ తీసుకొస్తే.. ఇప్పటివరకు బ్యాంకులకు మాత్రమే బంగారం సేకరించే అవకాశం ఉన్నది.ఇకపై జ్యువెలర్స్ కూడా ఆ అధికారాన్ని పొందుతాయి.భారతీయుల ఇళ్లలో నిల్వ ఉన్న బంగారాన్ని పెద్దఎత్తున సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సుమారు వెయ్యి టన్నులకుపైగా బంగారం సమీకరించవచ్చని అంచనాలు ఉన్నాయి.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా భారతీయుల వద్ద 25 వేల టన్నులకు పైగా బంగారం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు కేవలం 5 శాతం బంగారం సేకరించి నగదీకరణ చేసినా దాదాపు 80–90 బిలియన్ డాలర్లు(రూ.7.6-8.57 లక్షల కోట్ల) లిక్విడిటీ అందుబాటులోకి వస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా. 2015లో గోల్డ్ మానిటైజేషన్ స్కీం తీసుకొచ్చినా ఇప్పటివరకు కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే సమీకరించారు. బ్యాంకులకు తక్కువ వ్యాపార ప్రోత్సాహం, పన్ను భయాలు, ప్రజల్లో బంగారంపై ఉన్న భావోద్వేగ విలువలు వంటి కారణాలతో స్కీమ్ పెద్దగా సక్సెస్ కాలేదని టాక్. భవిష్యత్ లో ప్రజల వద్దనున్న బంగారాన్ని విడతల వారీగా సేకరించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా తెచ్చే కొత్త మార్గదర్శకాల ప్రకారం భారతీయుల వద్ద ఉపయోగంలో లేని అనగా నిల్వ ఉంచిన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం వలన దిగుమతుల భారం తగ్గి కరెంట్ అకౌంట్ మీద ఒత్తిడి తగ్గుతుందని.. విదేశీ మారక నిల్వలు తగ్గకుండా ఉంటాయని.. ఫలితంగా రూపాయి బలహీన పడకుండా స్థిరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టే చాన్స్ ఉందని పేర్కొంటున్నారు.












